Begin typing your search above and press return to search.

తాలిబన్లకు మహిళలు మనుషులు కాదా?... షాకింగ్ కామెంట్స్!

శుక్రవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Oct 2025 9:56 PM IST
తాలిబన్లకు మహిళలు మనుషులు కాదా?... షాకింగ్ కామెంట్స్!
X

శుక్రవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో తస్లిమా నస్రీన్ నుంచి ఘాటు విమర్శలు వచ్చాయి.

అవును... అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కావాలనే మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకున్నారని చెబుతూ.. కొందరు మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చింది.

'తాలిబన్లకు మహిళలు మనుషులు కాదు'!:

ఈ విషయంపై తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళ.. బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్ కు వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించగా.. ఆయన మహిళా జర్నలిస్టులు హాజరు కావడానికి అనుమతించలేదని అన్నారు.

ఇదే సమయంలో... తాలిబన్లు ఆచరించే ఇస్లాంలో.. మహిళలు ఇంట్లోనే ఉండి, పిల్లలను కనాలని.. వారి భర్తలు, పిల్లలకు సేవ చేయాలని మాత్రమే భావిస్తున్నారని తెలిపారు. ఈ స్త్రీ ద్వేషపూరిత పురుషులు ఇంటి వెలుపల ఎక్కడా స్త్రీలను చూడటానికి ఇష్టపడరని.. అసలు మహిళలను వారు మనుషులుగా పరిగణించరని.. అందుకే వారికి మానవహక్కులు ఇవ్వరని మండిపడ్డారు.

ఇక... ఆ మీడియా సమావేశానికి హాజరైన పురుష జర్నలిస్టులకు ఏదైనా మనస్సాక్షి అనేది ఉంటే.. వారు ఆ సమావేశం నుండి వాకౌట్ చేసి ఉండేవారని తస్లిమా నస్రీన్ అన్నారు. ఈ సందర్భంగా నీచమైన స్త్రీ ద్వేషంపై నిర్మించిన అనాగరిక రాజ్యానికి ఏ నాగరిక దేశం కూడా మద్దతివ్వకూడదని ఎక్స్ వేదికగా స్పందించారు! దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

స్పందించిన కేంద్ర ప్రభుత్వం!:

ఆమిర్ ఖాన్ ముత్తాఖీ ప్రెస్ మీట్ పై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం... ఆ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా... అఫ్గాన్ మంత్రి పర్యటన వేళ నిర్వహించిన మీడియా సమావేశానికి భారత్‌ లోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆహ్వానం అందిందని తెలిపింది.

విరుచుకుపడిన కాంగ్రెస్ నాయకులు!:

ఈ విషయంపై విపక్ష కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకునేందుకు అనుమతించడం ద్వారా మీరు వారికోసం నిలబడలేరని తెలుస్తోందంటూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో.. మన దేశంలో ప్రతి మహిళకు సమాన భాగస్వామ్యం పొందే హక్కు ఉందని చెప్పిన ప్రియాంక గాంధీ.. ఇలాంటి చర్యలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

అదేవిధంగా... ఆఫ్ఘనిస్తాన్‌ కు చెందిన అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రసంగించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను మినహాయించడం తనకు షాక్ ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం స్పందించారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. తమ మహిళా సహోద్యోగులను మినహాయించారని తెలుసుకున్న పురుష జర్నలిస్టులు వాకౌట్ చేసి ఉండాలని పేర్కొన్నారు!

తాలిబాన్ అధికారి వెర్షన్ ఇది!:

మరోవైపు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోన్న వేళ తాలిబాన్ అధికారి ఒకరు స్పందించారు. ఇందులో భాగంగా... తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని వెల్లడించారు. పాస్‌ ల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల అవి కొందరికి మాత్రమే అందాయని.. ఇది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమేనని తెలిపారు.

ఆందోళనకరంగా ఐక్యరాజ్యసమితి నివేదికలు!:

ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం... ఆగస్టు 2021లో అధికారం చేపట్టిన "తాలిబాన్ 2.0" పాలనలో ఆఫ్ఘన్ మహిళలు, బాలికలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మహిళా హక్కుల సంక్షోభంగా పిలిచే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు! మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారు! దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.