అఫర్డబుల్ హౌసింగ్ ....మిడిల్ క్లాస్ కి భారీ షాక్ !
ఇక ఈ కేటగిరీలను దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్స్ అందరికీ ఇళ్ళు అన్న కాన్సెప్ట్ తో ముందుకు సాగుతూ వస్తున్నారు.
By: Satya P | 24 Jun 2026 9:23 AM ISTఆర్ధిక విభజన ప్రకారం చూస్తే సమాజంలో అపర కుబేరులు, అత్యున్నత వర్గాలు, ఉన్నత వర్గాలు, ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు ఇలా అనేక రకాలైన కేటగిరీలు ఉంటాయి. ఇందులో కటిక పేదలు నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇచ్చే పధకాలు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. ఇక కుబేరులు అత్యున్నత వర్గాల వారికి ఇళ్ళు కాదు విలాసవంతమైన బంగళాలే ఉంటాయి. ఉన్నత వర్గాలు ఎగువ మధ్య తరగతి వర్గాలు , మధ్య తరగతి వర్గాలు వీలైతే దిగువ మధ్య తరగతి వర్గాల కోసం రియల్ ఎస్టేట్ రంగం గృహ నిర్మాణం చేపడుతూ వస్తోంది.
కేటగిరీగానే చేస్తూ :
ఇక ఈ కేటగిరీలను దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్స్ అందరికీ ఇళ్ళు అన్న కాన్సెప్ట్ తో ముందుకు సాగుతూ వస్తున్నారు. భారీ గృహ నిర్మాణంతో పాటుగా సమాంతరంగా అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణం కూడా కొనసాగుతూ వస్తోంది. అయితే గత కొంత కాలంగా చూస్తే దేశంలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఇది పూర్తిగా మధ్యతరగతి వర్గాలను పక్కన పెట్టేసినట్లుగానే ఉంది అని అంటున్నారు.
అందుబాటు ధరలు లేకుండా :
ఇక అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణం పతనం అన్నది ఒక్కసారిగా చూస్తే కనుక కేవలం ఆరేడేళ్ళ లో భారీగా పడిపోయింది అని చెప్పాల్సి ఉంది. 2019లో అఫర్డబుల్ హౌసింగ్ అన్నది దేశంలో 45 శాతంగా ఉన్న వాటా 2025 నాటికి వచ్చేసరికి ఏకంగా 13 నుంచి 14 శాతానికి పడిపోయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి అన్నది చూసెత భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా అమాంతం ఆకాశానికి ఎగబాకడం వంటి వాటి వల్లనే అని రియల్ ఎస్టేట్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్ ఉన్నా కూడా :
ఇక దేశంలో అనేక రాష్ట్రాలలో టైర్ టూ టైర్ త్రీ నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. తమ ఆదాయనికి తగిన విధంగా గృహాల నిర్మాణం జరిగితే తాము కూడా సొంతింటి వారం అవుతామని మధ్యతరగతి వర్గాల వారు భావిస్తున్నారు. అయితే అటువంటి పరిస్థితి అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిణామలతో ముడి సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి, ప్రాజెక్టులకు అనుమతులలో జాప్యం వల్ల కూడా బిల్డర్లకు వ్యయం పెరుగుతోందని అందుకే భారీ స్కేల్ తోనే హౌసింగ్ నిర్మాణం చేపడితేనే తమకు లాభమని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అనరాక్ రీసెర్చ్ డేటా నిపుణులు కూడా చెబుతున్నారు.
కోటి రూపాయలు ఉంటేనే :
ఇక ఈ రోజుల్లో అపార్ట్మెంట్ లో ప్లాట్ అయితే కోటి రూపాయలు పెడితేనే అని అంటున్నారు. అయితే మిడిల్ క్లాస్ సెక్షన్లు తమ శక్తి కేవలం అర కోటి లోపే అని అంటున్నారు. ఇంకా తక్కువకు వచ్చినా తాము హ్యాపీ అని చెబుతున్నారు. మరి ఆ కేటగిరీలో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అయితే రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం సిద్ధపడడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మధ్య తరగతి వర్గాలకు ప్రత్యేక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు ఇచ్చే అవకాశాలు అధికంగా ప్రస్తుతం ఉన్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలతో ముందుకు వస్తోంది. ఇలా రుణాలు ఇతర ఆర్ధిక సదుపాయాలను ఎంతగా పెంచుకున్నా కోటి రూపాయల ఇళ్ళు అంటే మిడిల్ క్లాస్ దూరం అవుతున్నారు. మరి సమీప భవిష్యత్తులో అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. గతంలో ప్రభుత్వ రంగంలోని పట్టణాభివృద్ధి సంస్థలే మధ్య తరగతి వర్గాలకు గృహ నిర్మాణం చేపట్టేవి. హౌసింగ్ కార్పోరేషన్లు కూడా ఉండేవి. ప్రస్తుతం మళ్ళీ వాటి ద్వారానే మధ్య తరగతి సొంతింటి కలను నిజం చేయాలని అంతా కోరుతున్నారు.
