మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత ఘర్ వాపసీ.. ఆపై మిస్సింగ్
ఆ వేధింపులు భరించలేకనే విడిపోయినట్లుగా పేర్కొన్నారు. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబం నుంచి వేధింపులు తగ్గలేదని.
By: Garuda Media | 7 April 2026 11:05 AM ISTలవ్ జిహాదీ.. ఘర్ వాపసీ మాటల్ని వింటుంటాం. సామాన్యుల్లో చోటు చేసుకునే ఈ అంశాలకు సంబంధించి చాలా వరకు బయటకు రాకుండా ఉంటాయి. కొన్ని బయటకు వచ్చినా.. వాటిలోని ప్రామాణికత మీద బోలెడంత చర్చ జరుగుతుంటుంది. అందుకు భిన్నంగా లవ్ జిహాద్.. ఘర్ వాపసీ లాంటి వాదనలకు బలం చేకూరే ఉదంతం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. దీనిసకి తోడు ఇది సెలబ్రిటీ.. హైప్రొఫైల్ కేసు కావటంతో దేశ వ్యాప్తంగా కొత్త చర్చ(రచ్చ)కు దారి తీసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అసలేం జరిగిందంటే..
2019 మిస్ ఇండియా ఎర్త్ విజేతగా నిలిచారు సయాలీ సర్వే. ఆమె ముంబయికి చెందిన సంపన్న వ్యాపారవేత్త ఆతిఫ్ తాసే అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కోసం ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును అతీజాగా మార్చుకున్నారు. ఇటీవల ఆమె భర్త.. అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని.. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్నాళ్లు భరించినట్లుగా వాపోయారు. ఇకపై పరిస్థితులు విషమించటంతో తాను విడిపోతున్నట్లుగా పేర్కొన్నారు. పిల్లలు కూడా తనతోనే ఉంటారన్న ఆమె.. గత నెలలో పింప్రి - చించ్వాడ్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెళ్లి వేళలో ఇస్లాంలోకి మారిన ఆమె గత నెలలో శుద్ధీకరణ ద్వారా హిందూమతంలోకి మారారు. తన పేరును ఆద్యా సర్వేగా మార్చుకున్నారు.
తాజాగా ఆమె.. ఆమె నలుగురు పిల్లలు కనిపించటం లేదన్నది సంచలనంగా మారింది. కొద్ది కాలం క్రితమే హిందూ మతంలోక మారిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. భర్త.. అత్తింటివారే ఆమెను కిడ్నాప్ చేసినట్లుగా ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఇటీవల ఆద్యా (అతీజా/సయాలీ) మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను పాటించొద్దని.. బుర్ఖా ధరించాలని అత్తమామలు వేధించేవారని ఆమె ఆరోపించారు.
ఆ వేధింపులు భరించలేకనే విడిపోయినట్లుగా పేర్కొన్నారు. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబం నుంచి వేధింపులు తగ్గలేదని. తనను భౌతికంగా.. మానసికంగా హింసిస్తున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాజీ భర్త ఆతిఫ్ తాసే.. మరికొందరు కలిసి.. ఆమెను.. నలుగురు పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది హైప్రొఫైల్ కేసుతో పాటు.. సున్నితమైన అంశం కావటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ సంప్రదించేందుకు అనువుగా లేదని.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని.. ఆమెను తక్షణమే రక్షించాలని హిందూత్వ సంస్థల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఘర్ వాపసీ కార్యక్రమాన్ని నిర్వహించటం.. పిల్లల్ని తనతో ఉంచుకోవటంపై ఆమె మాజీ భర్త ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యన ఆమె మాట్లాడుతూ.. తన ఘర్ వాపసీ తర్వాత తనకు తరచూ పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆమె.. పిల్లల ఆచూకీ కోసం ముంబయి.. పుణెతో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఆమె భర్త ఆతిఫ్ తాసే కుటుంబం ముంబయిలో రాజకీయంగా.. ఆర్థికంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నట్లు చెబుతారు. ఆద్యా (అతీజా/సయాలీ) హిందూ మతంలోకి మారిన తర్వాత ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
మాజీ భార్య హిందూమతంలో మారటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె తన పిల్లల్ని చట్టవిరుద్ధంగా తీసుకెళ్లిందని.. వారిని ఇస్లామిక్ పద్ధతుల్లో పెంచాలని ఆయన వాదించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఘర్ వాపసీ తర్వాత తమ కుటుంబ పరువు పోయినట్లుగా సన్నిహితులవద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక.. పిల్లల విషయానికి వస్తే ముగ్గురు అమ్మాయిలు.. ఒక అబ్బాయిగా చెబుతున్నారు. తల్లితో పాటు పిల్లలు ఉండేందుకే ఇష్టపడ్డారని చెబుతున్నారు. తన పేరుతో పాటు.. పిల్లల పేర్లను కూడా ఆద్యా (అతీజా/సయాలీ) మార్చేశారు. ప్రస్తుతం ఆమె, పిల్లలు కనిపించకుండా పోవటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
