దత్త పుత్రిక...షర్మిలకు కొత్త ట్యాగ్
ఇక తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి అటునుంచి ఏపీకి వచ్చి కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల జగన్ నే తన టార్గెట్ గా ఎంచుకున్నారు.
By: Satya P | 10 April 2026 9:45 AM ISTఏపీ రాజకీయాల్లో ఈ దత్త పుత్రుడు పుత్రికల ట్యాగ్ పాలిటిక్స్ జోరుగా సాగుతోంది. ప్రత్యర్థులను విమర్శలు చేయడంతో పాటు వారి రాజకీయ వైఖరులను జనాలకు బలమైన సందేశం అందేలా చేయాలి అంటే ఈ తరహా అనుబంధాలను వాడుకోవడం అన్నది గత దశాబ్ద కాల రాజకీయాలో మొదలైంది. ఆ విధంగా చూస్తే వైసీపీ దీనిని స్టార్ట్ చేసింది అనుకోవాలేమో. జనసేన అధినేత పవన్ ని విమర్శించే క్రమంలో బాబుకు దత్తపుత్రుడు అని వైసీపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఒక దశలో పవన్ దీని మీద తీవ్ర అసహనం ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి అలా తనను అంటే కనుక ఊరుకోను అని గట్టిగా హెచ్చరించిన మీదట చాలా వరకూ తగ్గింది. అయితే ఇప్పటికీ అపుడపుడు ఈ తరహా ట్యాగ్ ని పవన్ కి తగిలించే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతూనే ఉంది.
అన్న మీద చెల్లి సెటైర్లు :
ఇక తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి అటునుంచి ఏపీకి వచ్చి కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల జగన్ నే తన టార్గెట్ గా ఎంచుకున్నారు. 2024 నాటికి ఆమె పీసీసీ చీఫ్ అయితే జగన్ సీఎం గా ఉన్నారు. అయితే గడచిన రెండేళ్ళుగా కూడా తమ విమర్శలలో జగన్ కే సింహ భాగం వాటాని ఇచ్చేందుకు షర్మిల ఉబలాట పడడం రాజకీయ వ్యూహంలో భాగంగానే అంతా చూస్తున్నారు. బీజేపీకి మోడీకి జగన్ దత్తపుత్రుడు అని షర్మిల మొదలెట్టి ఈ రోజుకీ ఆ విమర్శలను కంటిన్యూ చేస్తున్నారు ఏపీలో మరే పార్టీ ఈ తరహా విమర్శలు చేయడం లేదు, వామపక్షాలు అయితే బీజేపీకి జగన్ అనుకూలం అని అపుడపుడు అంటున్నా మరీ ఇంత పెద్ద మాటలు అనడం లేదు, ఇక టీడీపీ అయితే తాము బీజేపీకి దూరంగా ఉన్నపుడు జగన్ ని బీజేపీతో కలిపి విమర్శించినా ఇపుడు అనేందుకు ఆస్కారం అయితే లేదు. దాంతో షర్మిల జగన్ మీద ఈ విధంగా శర సంధానమే చేస్తున్నారు.
షర్మిలకి కూడా ట్యాగ్ :
మరి ఇంతకాలం షర్మిల జగన్ ని దత్తపుత్రుడు అంటూంటే వైసీపీ డిఫెన్స్ మోడ్ లో కాచుకుంటూ వచ్చిందే తప్ప మరో మాట అనలేకపోతోంది. ఇపుడు మాత్రం వైసీపీ అదే వ్యూహాన్ని ఆమె మీద అమలు చేస్తోంది. ఏకంగా కూటమి పార్టీల మొత్తానికే షర్మిల దత్త పుత్రిక అని వైసీపీ మహిళా నాయకురాలు వరుదు కళ్యాణి ఘాటు విమర్శలు చేశారు. షర్మిలకు ఎంతసేపూ జగన్ ని పట్టుకుని విమర్శించడమే పనిగా ఉందని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుతో షర్మిల చేతులు కలపడాన్ని ఆమె తప్పు పట్టారు. దీనికి ముందు షర్మిల బీజేపీని వైఎస్సార్ జీవితాంతం వ్యతిరేకిస్తే జగన్ మోదీకి దత్తపుత్రుడుగా మారారు అని విమర్శించారు. దానికి అదే టోన్ తో వైసీపీ ఇచ్చిన సరైన కౌంటర్ అన్న మాట.
వారసుడు జగన్ అంటూ :
వైయస్సార్ కి జగన్ వారసుడు కారని షర్మిల ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆయన ఆశయాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కూడా ఆమె తప్పు పట్టారు దానికి కూడా వరుదు కళ్యాణి ధీటైన బదులు ఇచ్చారు వైఎస్సార్ సిసలైన వారసుడు జగన్ అని స్పష్టం చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు అంటూ చాలా తొందరలోనే షర్మిలకు జనాల్కు బుద్ధి చెబుతారని హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి జగన్ దత్తపుత్రుడు అయితే షర్మిల దత్త పుత్రిక అయ్యారు అన్న మాట. ఈ విధంగా అన్నా చెల్లి రాజకీయాలు నిజమైన వైసీపీ అభిమానులలో మాత్రం కలతను సృష్టిస్తున్నాయనే అంటున్నారు అంతా.
