Begin typing your search above and press return to search.

హ‌రీ హ‌రీ నారాయ‌ణో.. ఆదినారాయ‌ణో..!

అంతే కాదు. పార్టీలో త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌న‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా.. ఆది అనేశారు.

By:  Garuda Media   |   8 April 2026 8:30 AM IST
హ‌రీ హ‌రీ నారాయ‌ణో.. ఆదినారాయ‌ణో..!
X

రాజకీయంగా సీనియర్ నాయకుడు ప్రస్తుతం బిజెపిలో ఉన్న జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు బిజెపి పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయా.. లేక ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లను.. ఇబ్బందుల‌ను పార్టీపై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. విష‌యానికి వ‌స్తే.. తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త‌న‌కు వాల్యూ లేకుండా పోయింద‌ని వ్యాఖ్యానించారు.

అంతే కాదు. పార్టీలో త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌న‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా.. ఆది అనేశారు. ఇలా.. పార్టీపై ఒక రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి ఈ ఆవేద‌న‌.. బాధత ఒక్క ఆదికి మాత్ర‌మే ప‌రిమితం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది శాస‌న స‌భ్యులు ఉన్నారు. వారెవ‌రూ కూడా ఇలా.. త‌మ‌ను పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ‌ను పార్టీ కించ ప‌రుస్తోంద‌ని.. వ్యాఖ్యానించ‌డం లేదు. యాగీ చేయ‌డం లేదు.

ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. కానీ, ఆది విష‌యం మాత్ర‌మే ఎందుకిలా వ‌చ్చింది? అనేది ప్ర‌శ్న‌. ఆది వ్య‌వ‌హారం పూర్తిగా వ్య‌క్తిగ‌తమ‌ని తెలుస్తోంది. ఆయన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. త‌న రాజ‌కీయాలు వేరేగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార వ్య‌వ‌హారాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి స‌హా.. ఇత‌ర నాయ‌కులతోనూ వివాదంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలోనూ అనేక వివాదాలు వ‌చ్చాయి. అయితే.. ఈ క్ర‌మంలో బీజేపీ సైలెంట్ గా వ్య‌వ‌హ‌రించింది.

ఆయ‌న‌ను మంద‌లించ‌లేదు. అదేస‌మ‌యంలో అనుకూలంగా కూడా మాట్లాడ‌లేదు. ఈ ప‌రిణామ‌మే ఆదికి ఆగ్ర‌హం తెప్పించింద‌న్న వాద‌న ఉంది. త‌న‌కు అనుకూలంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడ‌డం లేద‌న్న‌ది ఆయ‌న అక్క‌సుగా కూడా ఉంది. అంటే.. త‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి.. తాను చేస్తున్న ప‌నుల‌ను స‌మ‌ర్థించ‌క‌పోవ‌డంతోనే పార్టీపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న ఓ విశ్లేష‌ణ వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. పార్టీ ఇప్పుడు కూడామౌనంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని స్వ‌యంగా ఆది ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను కెల‌క‌డం ఎందుక‌నే ధోర‌ణిలో బీజేపీ రాష్ట్ర‌నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది.