వైసీపీ కోసం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!
తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దేశవ్యాప్తంగా జీఎస్టీ-2.0 సంస్కరణలపై ప్రజలకు వివరించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
By: Garuda Media | 5 Oct 2025 8:00 AM ISTఅదేంటి? అనుకుంటున్నారా? ఔను. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పరు.ఈ క్రమం లో ఎలాంటి నిర్ణయాలైనా వెలుగు చూసే అవకాశం ఉంది. తాజాగా ఉమ్మడి కడప జిల్లా జమ్మల మడుగు ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. వైసీపీ వంటి అరాచక, అన్యాయ పార్టీని ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానన్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దేశవ్యాప్తంగా జీఎస్టీ-2.0 సంస్కరణలపై ప్రజలకు వివరించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికూడా.. జీఎస్టీ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్నదే తన నిర్ణయమన్నారు. అరాచక పాలనకు అంతిమ సంస్కారం చేయాలన్నదే తన లక్ష్య మని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపారు. ఈ సీటును(జమ్మల మడుగు) భూపేష్ రెడ్డికి ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. సీఎం చంద్రబాబు కొన్నాళ్ల కిందటే ఈ విషయంపై మాట్లాడారని వెల్లడించిన ఆది.. అప్పుడే.. భూపేష్ రెడ్డికి జమ్మల మడుగు టికెట్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఎవరీ భూపేష్ రెడ్డి..?
జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఇంచార్జ్ చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి. ఈయన స్వయానా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి కుమారుడి వరస అవుతారు. ఆది అన్న కుమారుడే భూపేష్. గత ఎన్నికల్లోనే ఈ సీటును భూపేష్‌కు ఇవ్వాల్సి ఉంది. అయితే.. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆది నారాయణ విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికలకు ముందు 30 నెలల పాటు నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు భూపేష్ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి భూపేష్ రెడ్డికే టికెట్ ఇచ్చి.. తానే ప్రచారం చేసి గెలిపిస్తానని ఆది నారాయణరెడ్డి ప్రకటించడం గమనార్హం.
