Begin typing your search above and press return to search.

కార్పొరేట్ కాకున్నా.. ఉద్యోగాలు పోతున్నాయి.. ఏఐ తుఫాన్ ఇంకా ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో..

కానీ ఉన్నట్టుండి వందలాది కుటుంబాలకు ఆధారమైన ఉద్యోగాలు ఊడిపోతుంటే ఆ మానసిక వేదనను మాటల్లో వర్ణించలేం.

By:  A.N.Kumar   |   17 Sept 2026 2:00 PM IST
కార్పొరేట్ కాకున్నా.. ఉద్యోగాలు పోతున్నాయి.. ఏఐ తుఫాన్ ఇంకా ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో..
X

కార్పొరేట్ ప్రపంచంలో మార్పులు సహజమే కావచ్చు. కానీ ఉన్నట్టుండి వేల కుటుంబాల ఆధారమైన ఉద్యోగాలు ఊడిపోతుంటే ఆ వేదన వర్ణనాతీతం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెనుమార్పులు సృష్టిస్తున్న వేళ ఇప్పుడు ఆ సెగ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ ఇండియా గురుగ్రామ్ ప్రధాన కార్యాలయానికి తాకిందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కార్పొరేట్ ప్రపంచంలో హెచ్చుతగ్గులు, పునర్వ్యవస్థీకరణలు సాధారణ పరిణామాలే కావచ్చు. కానీ ఉన్నట్టుండి వందలాది కుటుంబాలకు ఆధారమైన ఉద్యోగాలు ఊడిపోతుంటే ఆ మానసిక వేదనను మాటల్లో వర్ణించలేం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ఐటీ నుండి రీటైల్ వరకు అనేక రంగాలపై దాని ప్రభావం కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ గురుగ్రామ్‌లోని తన ఇండియా గ్లోబల్ టెక్నాలజీ హబ్‌లో చేపట్టిన భారీ ఉద్యోగ కోతల నిర్ణయం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర అలజడిని, ఆందోళనను రేకెత్తిస్తోంది.

గురుగ్రామ్ కేంద్రంగా నడుస్తున్న అడిడాస్ టెక్నాలజీ హబ్‌లో పనిచేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగుల్లో సుమారు 45 నుండి 50 శాతం మందిని.. అంటే దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 15న నిర్వహించిన ఒక నిశ్శబ్ద టౌన్‌హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించి.. ప్రభావిత ఉద్యోగులకు ఎగ్జిట్ లెటర్లను అందజేసినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీ ఎదుగుదలకు చెమటోడ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డున పడి తమ భవిష్యత్తు ఏంటో తెలియక దిక్కుతోచని ఆవేదనలో మునిగిపోయారు.

సంస్థలో జరుగుతున్న ఈ లేఆఫ్స్‌ను అడిడాస్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ మోడల్‌ను సరళీకృతం చేయడానికి.. భవిష్యత్ సాంకేతిక వాతావరణానికి అనుగుణంగా సంస్థను బలోపేతం చేయడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి.. కొంతమందికి తక్షణమే నిష్క్రమణ లేఖలు ఇవ్వగా, మరికొందరికి బాధ్యతల బదిలీ పూర్తయ్యే వరకు వ్యవధి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ హఠాత్ నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ అందుబాటులోకి రావడంతో డేటా ప్రాసెసింగ్, కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక విధులు తక్కువ సిబ్బందితోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల సాంకేతిక విభాగాల్లో మానవ వనరుల అవసరం వేగంగా తగ్గుతోంది. కేవలం అడిడాస్ మాత్రమే కాకుండా ఇటీవల ఓరాకిల్, మెటా వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఇండియాలో ఉద్యోగ కోతలను అమలు చేయడం ఈ ఏఐ యుగంలోని తీవ్రమైన మార్పులకు అద్దం పడుతోంది.

సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నప్పటికీ దాని ఆధునీకరణకు బలివుతోంది మాత్రం రక్తం, చెమట చిందించిన సాధారణ ఉద్యోగులే. అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ లేఆఫ్స్ పరిణామాలు కేవలం అడిడాస్‌కే పరిమితం కాకుండా.. రాబోయే రోజుల్లో సాంకేతిక రంగంలో మానవ శ్రమకు ఉన్న స్థానం ఏంటి..? ఆటోమేషన్ వల్ల మరెన్ని వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయనే తీవ్రమైన ఆందోళనను ప్రతీ ఒక్కరిలోనూ రేకెత్తిస్తోంది.