Begin typing your search above and press return to search.

అద్దంకిలో వైసీపీ దిద్దుబాటు రాజ‌కీయం!

ఆయా మండ‌లాల్లో మంత్రి గొట్టిపాటికి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌డంతో స్థానికంలో అధిరిపోయే రిజ‌ల్ట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

By:  Garuda Media   |   30 Sept 2026 6:09 PM IST
అద్దంకిలో వైసీపీ దిద్దుబాటు రాజ‌కీయం!
X

బాప‌ట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో స్థానిక ఎన్నిక‌ల రాజకీయ వాతావరణం కూటమి ప్రభుత్వ పట్టుతో పాటు ప్రతిపక్ష వైసీపీ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలతో క్రియాశీలకంగా ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ముండ్లమూరు, కొరిశపాడు, జే.పంగులూరు, సంతమాగులూరు, అద్దంకి మండలాలు ఉన్నాయి. ఆయా మండ‌లాల్లో మంత్రి గొట్టిపాటికి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌డంతో స్థానికంలో అధిరిపోయే రిజ‌ల్ట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే.. వైసీపీ గతంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఎమ్మెల్యే బలమైన నాయ‌కుడిగా ఉన్నార‌న్న‌ది స్థానికంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. గొట్టిపాటి రవికుమార్ వరుసగా ఇక్కడి నుండి ఐదోసారి విజయం సాధించి రికార్డు సృష్టించారు. దీంతోపాటు కూటమి అధికారంలోకి రావడం, ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలపై టీడీపీ క్యాడర్ గట్టి పట్టు సాధించింది. ఇదే స‌మ‌యంలో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ కూడా విస్తరిస్తూ కూటమి బలాన్ని పెంచుతోంది. ఇదంతా స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చిన హనిమిరెడ్డి స్థానంలో పార్టీ అధిష్టానం సమూల మార్పులు చేస్తోంది. పార్టీ కేడర్‌ను యాక్టివ్ చేసేందుకు., నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కొత్త ఇన్‌ఛార్జ్ లను నియమించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. అనుకున్న విధంగా వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రకంగా చెప్పాలంటే.. ఒక‌ప్పుడుశ్రేణుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన వైసీపీ ఇప్పుడు జెండా మోసేవారు లేక ఇబ్బందులు ప‌డుతోంది.

మొత్తంగా చూస్తే, అద్దంకి మండలాల్లో ప్రస్తుతం అధికార పక్షం (కూటమి) పూర్తి ఆధిపత్యంలో ఉండగా, ప్రతిపక్ష వైసీపీ రాబోయే రోజుల్లో పుంజుకోవడానికి అంతర్గత బలోపేతంపై దృష్టి పెడుతోంది. అయితే.. కీల‌క నాయ‌కులుగా ఉన్న క‌ర‌ణం ఫ్యామిలీ వైసీపీలోనే ఉన్నా.. పార్టీకి దూరంగా ఉంటోంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో వైసీపీ శ్రేణుల‌పై ఈ ప్ర‌భావం క‌నిపిస్తోంది. దీనికితోడు.. మంత్రి గొట్టిపాటి చేస్తున్న అభివృద్ధి ప‌నులతో కూడా.. వైసీపీ కేడ‌ర్ విచ్ఛిన్న‌మైంది. ఫ‌లితంగా స్థానిక ఎన్నిక‌ల్లో మండ‌ల ప‌రిష‌త్‌ల నుంచి జిల్లా ప‌రిష‌త్ వ‌ర‌కు కూడా.. కూట‌మిదే విజ‌యం అనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.