Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల సందర్భంగా విద్యార్థులకు సెలవు ఇస్తామని మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతి రెడ్డి ప్రకటించడం వివాదంగా మారింది. విద్యార్థి సంఘాలు, నెటిజన్ల విమర్శలతో ఆమె స్పందిస్తూ.. వేదికపై సరదాగా అన్నానే తప్ప అధికారికంగా సెలవు ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లపై చర్చకు దారితీసింది.

By:  A.N.Kumar   |   13 Nov 2026 12:47 PM IST
మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..
X

సాధారణంగా పండుగలకో.. జాతీయ దినోత్సవాలకో.. లేదంటే కనీసం భారీ వర్షాలకో కాలేజీలకు సెలవులు ఇస్తుంటారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోందన్న కారణంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే వినూత్న సంప్రదాయానికి మల్లారెడ్డి యూనివర్సిటీ తెరతీసింది. అయితే వేదికపై ఆవేశంతోనో.. ఆనందంతోనో చేసిన ఆ ప్రకటన కాస్తా వివాదంగా మారడంతో ఇప్పుడు మల్లారెడ్డి కోడలు.. ఆ విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి "నేనన్నది జస్ట్ జోక్ అండీ" అంటూ మాట మార్చాల్సి వచ్చింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 23న మల్లారెడ్డి యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగింది. తమ క్యాంపస్‌కు వెంకటేష్ రావడంతో ప్రీతి రెడ్డి గారి ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. స్టేజీపై వెంకీ మామతో కలిసి స్టెప్పులేసి సందడి చేయడమే కాకుండా సినిమా రిలీజ్ రోజున స్టూడెంట్స్ అందరికీ కాలేజీ సెలవు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించేశారు. కుర్రకారు కేరింతలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

సినిమా పేరు ఆదర్శ కుటుంబం కావొచ్చు కానీ విద్యాసంస్థల నిర్వహణలో ఇదేం ఆదర్శమని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ వంటి విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. చదువుల తల్లి కొలువుండే సరస్వతీ నిలయాలను.. సినిమా ప్రమోషన్లకు అడ్డాలుగా మారుస్తారా? రేపు మరో హీరో సినిమా వస్తే వారం రోజులు సెలవు ఇస్తారా? అంటూ నిలదీశాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ నడిచింది. అడ్మిషన్ల సమయంలో ర్యాంకులు, రీసెర్చ్ అని చెప్పి.. తీరా చేరాక సినిమా రిలీజ్‌లకు సెలవులు ఇస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు.

వివాదం ముదిరి వ్యవహారం కాస్తా ఉన్నత విద్యామండలి వరకు వెళ్లడంతో ప్రీతి రెడ్డి మీడియా ముందుకు వచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాను వేదికపై ఆ సరదా మూడ్‌లో సెలవు అని అన్నానే తప్ప అధికారికంగా ఎలాంటి సర్క్యులర్ జారీ చేయలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ విద్యార్థులు ఏడాది పొడవునా చదువు.. పరిశోధనలతో తలమునకలై ఉంటారని.. రెండు మూడు రోజులు ఇలాంటి ఈవెంట్లతో రిలాక్స్ అయితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. పైగా తమ కాలేజీకి అడ్మిషన్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని కూడా గుర్తు చేశారు.

క్యాంపస్‌లకు సెలబ్రిటీలు రావడం.. విద్యార్థులు ఎంజాయ్ చేయడం తప్పు కాదు. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు మైక్ పట్టుకున్నప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. స్టేజీపై వేలమంది విద్యార్థుల సాక్షిగా ఇచ్చిన హామీని ఇచ్చేసి.. బయటకు వచ్చాక అది సరదాకి అన్నాను అని తేలికగా తీసిపారేయడం విడ్డూరంగా ఉంది.

ఈ ఎపిసోడ్‌తో ఆదర్శ కుటుంబం సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది కానీ ప్రీతి రెడ్డి సరదా మాటలు మాత్రం విద్యావ్యవస్థ తీరుపై పెద్ద చర్చకే దారితీశాయి.