అదానీపై అమెరికా సంస్థ సమన్లు.. అసలు కేసేంటి?
గౌతమ్ అదానీకి అమెరికాకు చెందిన సంస్థ ఒకటి సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు మోడీ సర్కారు అడ్డుకకుంటుందన్న ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Garuda Media | 23 Jan 2026 11:59 AM ISTగౌతమ్ అదానీకి అమెరికాకు చెందిన సంస్థ ఒకటి సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు మోడీ సర్కారు అడ్డుకకుంటుందన్న ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? భారత కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ ఎలాంటి తప్పు చేశారు? ఇంతకూ ఆయనకు సమన్లు ఇవ్వాలనుకున్న అమెరికా సంస్థ ఏంటి? దాని స్థాయి ఏంటి? అన్న అంశంతో పాటు.. ఈ మొత్తం వ్యవహారంలోకి వెళితే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఝేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కు పేరుంది. అయితే.. ఈ సంస్థ భారత కుబేరుడు గౌతమ్ అదానీకి, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి సమన్లు జారీ చేయాలని తాము భావిస్తున్నట్లుగా పేర్కొంటూ అందుకు అవసరమైన అనుమతుల్ని కోరుతూ భారత సర్కారును కోరింది. దీనికి స్పందించిన కేంద్రం.. హేగ్ సర్వీస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా సదరు సమన్లు ఉన్నట్లుగా మోడీ సర్కారు చెప్పినట్లుగా సదరు సంస్థ పేర్కొంది.
అయితే.. తాము హేగ్ సర్వీస్ ఒప్పందంలోని అన్ని నిబంధనల్ని పాటించినట్లుగా ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. గత ఏప్రిల్ లోనూ తాము సమన్లు జారీకి ప్రయత్నిస్తే.. సంతకాలు.. సరైన స్టాంపులు లేవని సాకులు చెప్పినట్లుగా పేర్కొంది. అందుకే భారత న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా అదానీకి సమన్లు జారీ చేయలేమని.. నేరుగా కంపెనీ అధికారిక ఈ మొయిల్ కు సమన్లు ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలని కోర్టును కోరింది.
ఇంతకూ ఈ రచ్చకు కారణమేంటి? గౌతమ్ అదానీకి సమన్లు అందించాలన్న అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చింది? అన్న విషయంలోకి వెళితే.. సౌర విద్యుత్తు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేసింది.ఇందులో భాగంగా భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికల్ని సిద్దం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవటానికి ఆంధ్రప్రదేశ్, ఒఢిశా, తమిళనాడు. జమ్ముకశ్మీర్, ఛత్తీస్ గఢ్ రాష్టరాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధిలు రూ.2238 కోట్ల లంచాల్ని ఆఫర్ చేసినట్లుగా ఎఫ్ బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది.
దీంతో రాబోయే ఇరవై ఏళ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్ల లబ్థి పొందేలా అదానీ గ్రూపు పలాన్ చేసినట్లుగా సదరు అమెరికన్ సంస్థ ఆరోపిస్తోంది. అదానీ ఇదంతా చేస్తే.. అక్కడెక్కడో అమెరికాలో ఉన్న ఆర్థిక సంస్థకు అంత నొప్పేంటి? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. అదానీ ఇవ్వాలనుకున్న లంచానికి అవసరమైన సొమ్ముల్ని అమెరికాలో బ్యాంకులు.. పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసేందుకు ప్రయత్నించిందని.. అందుకే కేసు నమోదు చేయాలని తాము కోరుతున్నట్లుగా పేర్కొంది.
అయితే.. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎఫ్ బీఐ, ఎస్ ఈసీ దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా కుట్రలు పన్నినట్లుగా ఆరోపణలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా బాగానే ఉంది. ఇంతకూ ఈ స్కామ్ ఎలా బయటకు వచ్చిందన్న సందేహాన్ని తీర్చే వాదనను వినిపిస్తున్నారు. ఆ మధ్యన అదానీ సంస్థపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మ్యానిఫ్యులేషన్ జరిగినట్లుగా సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసు ఒకటి అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది.
ఈ కేసు లోతుల్లోకి వెళ్లిన వేళ.. కొందరు లాయర్లు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లుగా సందేహాలు వచ్చాయి. దీంతో వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న మాట వినిపిస్తోంది. మరి.. అమెరికా ప్రభుత్వం ఎందుకు ఎంట్రీ ఇచ్చిందన్న దానికి సమాధానం చెబుతున్నారు. ఎఫ్ బీఐ ఆరోపిస్తున్న ఎనిమిది మంది నిందితుల్లో నలుగురు అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు ఈ స్కామ్ లో అమెరికా ఇన్వెస్టర్లు, అమెరికన్ బ్యాంకుల నిధులు ఉన్న కారణంగా అమెరికా ప్రభుత్వం ఇందులోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అదానీ గ్రూప్ మీద తాజాగా వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే అమెరికాలోని నిబంధనల ప్రకారం గౌతమ్ అదానీకి ఐదేళ్ల శిక్షతో పాటు.. రెండు మిలియన్ డాలర్ల జరిమానా విధించొచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీకి సమన్లు జారీ చేసే విషయంలో మోడీ సర్కారు ఏ మాత్రం సహకరించటం లేదని సదరు అమెరికాకు చెందిన ఆర్థిక నియంత్రణ సంస్థ ఆరోపిస్తోంది.
అయితే.. భారత సంపన్నులను టార్గెట్ చేసుకొని.. తద్వారా దేశంలో కలకలాన్ని రేపటానికి.. రాజకీయంగా అనిశ్చితికి.. కేంద్రం లో బలంగా ఉన్న మోడీ సర్కారును దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది మరో వాదన. ఈ సందర్భంగా హిండెన్ బర్గ్ రిపోర్టు పేరుతో జరిగిన ఆగమాగం ఒక ఉదాహరణ. దేశంలో స్టాక్ మార్కెట్ లో కల్లోలానికి కారణమైన సదరు అమెరికా సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకంటే వారి రిపోర్టు కారణంగా భారత స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్ ను తలపించటం తెలిసిందే.
రాజకీయ విభేదాల నేపథ్యంలో మోడీ సర్కారును దెబ్బ తీయటానికి అదానీ లాంటి వాళ్లను ఒక ఉపకరణంగా వాడుతున్నారన్నది మరో వాదన. దీనికి రాజకీయంగా మోడీ సర్కారును విభేదించే రాజకీయ పార్టీలకు చెందిన మీడియా సంస్థలు సైతం బాధ్యతారాహిత్యంతో చెలరేగిపోతున్న తీరును తప్పు పడుతున్నారు. అమెరికా వాడి వ్యూహంలో భారత్ కు చెందిన మీడియా సంస్థలు ఎందుకు అంత అతిగా రియాక్టు అవుతున్నాయన్నది మరో ప్రశ్న. అందుకే.. తమకు తోచినట్లుగా అవాకులు చవాకులు పేలే కొన్ని మీడియా సంస్థలు.. సందట్లో సడేమియా అంటూ చెలరేగిపోయే కొందరు మేధావుల మాటల్ని నమ్మే బదులు.. క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పకతప్పదు.
