Begin typing your search above and press return to search.

విజయ్ ‘వి’ కనెక్షన్.. బరిలో దిగే స్థానంపై ఇదే ప్లానింగ్

సిని తారలకు.. రాజకీయనేతలకు ఉండే సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Garuda Media   |   12 Feb 2026 9:58 AM IST
విజయ్ ‘వి’ కనెక్షన్.. బరిలో దిగే స్థానంపై ఇదే ప్లానింగ్
X

సిని తారలకు.. రాజకీయనేతలకు ఉండే సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకాలకు చింతకాయలు రాలతాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. వారు మాత్రం తాము నమ్మిన దాని కోసం ఎంతకైనా వెళతారు. సెంటిమెంట్లకు పెద్దపీట వేయటం వీరికి అలవాటే. తాజాగా తమిళ అగ్రనటుడు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం.. టీవీకే (తమిళగ వెట్రి కళగం) పేరుతో పార్టీ పెట్టిన ఆయన ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనకు అనూహ్య రీతిలో పరీక్షలు ఎదురవుతున్నాయి. వాటిని తట్టుకొని నిలుస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కీలకభూమిక పోషిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన స్వయంగా బరిలోకి దిగే చోటు ఏది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. తన పేరులోని మొదటి అక్షరమైన ‘వి’తో ప్రారంభమయ్యే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. వి అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే గెలుపు ఖాయమని ఒక జ్యోతిష్యుడు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. వీ అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలు ఏమిటన్న దానిపై కసరత్తు స్టార్ట్ అయినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా చెన్నైలోనివేళచ్చేరి, విరుగంబాక్కం నియోజకవర్గాలతో పాటు విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాల్ని విజయ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. విరుగంబాక్కంలో ఆయన తల్లిదండ్రులు నివసిస్తుంటారు. ఇక.. ఆయన పరిశీలిస్తున్న మరో నియోజకవర్గం వేళచ్చేరి.. ఆయన ఇంటికి, పార్టీ కార్యాలయానికి కొద్దిదూరంలోనే ఉన్నాయి. ఆయన పార్టీ తొలి రాజకీయ మహానాడు జరిగిన ప్రాంతం విక్రవాండి కావటం గమనార్హం. దీంతో.. విజయ్ బరిలోకి దిగే స్థానం ఏమై ఉంటుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు.. తనను చికాకు పెడుతున్న విజయ్ కు ఎన్నికల్లో గట్టి పాఠం చెప్పాలన్న యోచనలో అధికార డీఎంకే ఉంది.

విజయ్ పోటీ చేసే స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించటం ద్వారా ఊహించని షాక్ ఇవ్వాలన్న ఆలోచనలో డీఎంకే నాయకత్వం ఉందని చెబుతున్నారు. దీంతో.. తాను బరిలోకి దిగే నియోజకవర్గంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా విజయ్ వ్యూహాత్మకంగా వ్యవమరిస్తున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో మరికొద్ది నెలల్లో తేలనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ - మేలో జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 2026తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏప్రిల్ - మే మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా.. 117 స్థానాలను దాటాల్సి ఉంటుంది.