Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ బాటలో ధనుష్ రాజకీయ ప్రవేశం?

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది.

By:  Sivaji Kontham   |   2 Jun 2026 11:30 AM IST
దళపతి విజయ్ బాటలో ధనుష్ రాజకీయ ప్రవేశం?
X

తమిళ చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు దశాబ్దాలుగా విడదీయరాని బలమైన బంధం ఉంది. ఎంజీ రామచంద్రన్, జే జయలలిత వంటి దిగ్గజాలు సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా తమిళనాడును పాలించారు. కరుణానిధి, జయలలిత యుగం ముగిశాక... రీసెంట్‌గా దళపతి విజయ్ రాజకీయాల్లో ప్ర‌వేశించి సంచలనాలు సృష్టించారు. అత‌డు స్థాపించిన `తమిళగ వెట్రి కళగం` (TVK) పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అవతరించడమే కాకుండా... మే 2026లో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. ద్ర‌విడ పార్టీల‌ను ఎదుర్కొని గెలిచిన ఈ సినీహీరో త‌న స‌హ‌చ‌ర న‌టుల‌లో కాన్ఫిడెన్స్ నింపాడ‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. ఎంజీఆర్-క‌రుణానిధి, జ‌య‌ల‌లిత త‌ర్వాత సంచ‌ల‌నాలు సృష్టించిన ఏకైక‌ ఫిలింస్టార్ విజ‌య్ మాత్ర‌మే.

సాంప్రదాయ ద్రవిడ పార్టీలను ఎదిరించి విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం, అత‌డి సహచర నటులలో సరికొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. దీనికి బలం చేకూరుస్తూ ఆయ‌న‌ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా తాజాగా ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ తమిళ రాజకీయాల్లో, సినీ వర్గాల్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది.

చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కస్తూరి రాజాను ధనుష్ రాజకీయారంగేట్రం గురించి మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా తమకు నచ్చితే రాజకీయాల్లోకి రావచ్చని.. ఆ అవకాశం అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. కేవలం తన పిల్లలే కాదు... భవిష్యత్తులో తన మనవళ్లు కూడా ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని చెబుతూ...ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఆయన ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌క‌పోయినా... ఆ అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేదు. ఆయన మాటలను బట్టి ధనుష్‌కు త‌మిళ‌నాడు పొలిటిక‌ల్ కారిడార్ లో తలుపులు తెరిచే ఉన్నాయని అర్ధమవుతోంది. ఇది అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది.

ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ `కార` ఇటీవల విడుదలై ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో పాటు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మమ్ముట్టితో కలిసి నటిస్తున్న D55, తమిళరసన్ పచ్చముత్తుతో D56, మారి సెల్వరాజ్‌తో D57 చిత్రాలతో పాటు.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న `వడ చెన్నై 2` చిత్రాలు ఆయన లైన్-అప్‌లో ఉన్నాయి.

గత ఏడాది లో కూడా ధనుష్ మూడు భారీ చిత్రాలైన కుబేర, ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే ల‌ను విడుదల చేయడమే కాకుండా.. దర్శకుడిగా తన మూడో చిత్రం `నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం`ను కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇలా ఒకవైపు సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా ఉత్త‌మంగా రాణిస్తూనే... మరోవైపు భవిష్యత్తులో విజయ్ స్ఫూర్తితో ధనుష్ రాజకీయ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడతారేమో చూడాలి.