ఏబీవీ స్వీయ పరీక్ష.. రిటైర్డ్ ఐపీఎస్ వ్యూహంపై ఇంట్రస్టింగ్ డిబేట్
విజయవాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 20 Oct 2026 12:00 AM ISTవిజయవాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఏబీవీ కొంతకాలంగా కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నలు చేస్తున్నారు. ఈలోగా ఆయన మేయర్ అభ్యర్థిగా పోటీకి దిగడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. సీనియర్ పోలీసు అధికారిగా ఏబీవీకి రాష్ట్రంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న చట్టసభలకు పోటీ చేస్తారని భావించారు. కానీ, ఏబీవీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్థానిక సంస్థల బరిలో దిగి అందరి దృష్టిని ఆకర్షించారని అంటున్నారు.
మేయర్ గా పోటీ చేస్తున్న ఏబీవీ రాజకీయాల్లో రాణించాలనే తన లక్ష్యానికి స్వీయ పరీక్ష పెట్టుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేయర్ వంటి పదవులకు స్థానికంగా పట్టు, పార్టీల మద్దతు ఉండాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బరిలోకి దిగిన ఏబీవీ ఇండిపెండెంట్ గా ఎన్నికలను ప్రభావితం చేయగలరా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉండగా, విపక్షం వైసీపీ కూడా స్థానిక నేతల మద్దతుతో గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏబీవీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.
బ్యూరోక్రాటుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. ఈ జాబితాలో సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ, లోక్ సత్తా మాజీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ వంటివారి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ్ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని స్థాపించి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా కనుమరుగు అయ్యారు. అదేవిధంగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే సుమారు లక్ష ఓట్లు సాధించి ప్రజల్లో ఆదరణ ఉందని నిరూపించుకున్నారు.
ఈ క్రమంలో ఏబీవీ విజయవాడలో ఎలాంటి పనితీరు చూపగలరనేది ఆసక్తి రేపుతోంది. సుమారు 9 లక్షల ఓట్లు ఉన్న విజయవాడ నగరంలో ఏబీవీ గట్టిపోటీ ఇవ్వాలంటే దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు ఓట్లు సాధించాల్సి వుందని అంటున్నారు. అలా అయితే ఆయన భవిష్యత్తు రాజకీయాలకు కూడా సరైన మద్దతు లభించినట్లుగా భావించొచ్చునని అంటున్నారు. లేనిపక్షంలో ఏబీవీ రాజకీయ ఆలోచనలు విరమించుకోవాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఏబీవీ కొన్ని సమయాల్లో ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోనుచేస్తూ పైచేయి సాధిస్తున్నారు. ఏబీవీ వంటి వారి ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నాయనే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఆయన విమర్శలను సమీక్షించుకుంటూ సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏబీవీ తనకు ప్రజల్లో ఆదరణ ఉందని నిరూపించుకుంటే ఆయన ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధిస్తే ఏబీవీ మాటలకు మరింత విలువ పెరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఫలితం వేరుగా ఉంటే మాత్రం భవిష్యత్తుల్లో ఏబీవీ మాటను పట్టించుకునే వారే ఉండరని హెచ్చరిస్తున్నారు. డబ్బు, అధికారం ప్రభావం చూపే కార్పొరేషన్ ఎన్నికల్లో అవి లేకుండా ఏబీవీ వంటి ఉన్నత విద్యావంతులు, రిటైర్డు ఉద్యోగులు ఏమేరకు ఫలితం సాధిస్తారో చూడాల్సివుందని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల రణ క్షేత్రంలో తనకు తానుగా దిగిన ఏబీవీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆయన భవిష్యత్తును నిర్దేశించనుందని అంటున్నారు.
