సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టారో ఇక అంతే !
సోషల్ మీడియా ఈ రోజు మెయిన్ స్ట్రీం మీడియాను సైతం అధిగమించి ముందుకు సాగుతోంది.
By: Satya P | 17 Sept 2025 9:06 AM ISTసోషల్ మీడియా ఈ రోజు మెయిన్ స్ట్రీం మీడియాను సైతం అధిగమించి ముందుకు సాగుతోంది. ఇది ఒక సామాజిక విప్లవంగా ఉంది సామాన్యుడే పాత్రికేయుడు అయిన వైనంగా ఉంది. ఇదివరకూ మీడియాలో పేరు చూసుకోవాలంటే ఎంతో చేయాల్సి వచ్చేది. కానీ ఈ రోజు తామే ఒక మీడియాగా ప్రతీ ఒక్కరూ మారిపోయిన పరిస్థితి ఉంది ఒక విధంగా అంతా మెచ్చాల్సింది ఇది. ఆహ్వానించాల్సిన పరిణామం కూడా ఇది.
పదునైన అస్త్రంగా :
అయితే చిత్రమేంటి అంటే మంచితోనే చెడు ఉంటుంది. కత్తితో కూర తరగవచ్చు పీక కూడా కోయవచ్చు అన్నట్లుగా సోషల్ మీడియా ఆరంభంలో వింతంగా ఉంటూ మంచిగానే కనిపించింది కానీ తరువాత అది చిత్రాతిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. చేతిలో పవర్ ఫుల్ ఆయుధంగా ఉండాల్సిన దానిని కోరి పాడు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ వెతలు తమ కధలు తమ బాధలు తమ గొప్పలు తమ ప్రతిభలు తమ చుట్టూ ఉన్న వారి జీవితాలు ఇలా ఎన్నో చెబుతూ పది మందిలోకి విషయం వెళ్ళేలా చేయాల్సిన సోషల్ మీడియా కాస్తా వ్యక్తిత్వ హననాలకు తిట్లకు చీవాట్లకు అనుచితమైన భాషకు కేరాఫ్ గా మారుతోంది.
అందరూ బాధితులే :
దాంతో సోషల్ మీడియాకు అందరూ బాధితులే అయిపోయారు. అంతే కాదు అందరూ ఏదో విధంగా ఈ పరిస్థితికి కారకులు అయిపోయారు. రాజకీయ పార్టీలకు విపరీతమైన ప్రచారం అవసరం. దాంతో సోషల్ మీడియా వారికి ఒక బ్రహ్మాండమైన వేదికగా మారింది. అదే సమయంలో బయట సాగినట్లుగా అక్కడ కూడా తిట్ల పురాణాలు వారిని వీరు వీరిని వారూ లంకించుకోవడంతోనే మొత్తం కధ అడ్డం తిరుగుతోంది. ఇంట్లో ఉన్న వారిని ఏ పాపం ఎరుగని ఆడవారిని సైతం సోషల్ మీడియా లాగి అన్యాయం చేస్తోంది. దాంతో దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని మేధావుల నుంచి అంతా అనుకునే నేపధ్యం ఉంది.
మంత్రి వర్గ ఉప సంఘం :
సోషల్ మీడియా ద్వారా కావాలని మహిళలను కించపరచే వారి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్ధసారధి ఉంటారు. దీని మీద ప్రభుత్వం ఒకటి రెండు రోజులలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది అని అంటున్నారు. మహిళలను కించపరుస్తూ అసభ్యంగా పెట్టే పోస్టుల మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఉప సంఘం అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అని అంటున్నారు.
అసెంబ్లీలో బిల్లుగా :
ఇక మూడు నెలల పాటు మంత్రివర్గ ఉప సంఘం ఈ విషయం మీద కసరత్తు చేసిన మీదట సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీలో సోషల్ మీడియా పోస్టులు అసభ్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకునేలా పదునైన చట్టాన్ని తీసుకుని వస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గతంలోలా ఎవరిని పడితే వారిని పట్టుకుని పోస్టులు పెడుతూ రెచ్చిపోయే బ్యాచులకు ఇక కళ్ళెం పడినట్లే అంటున్నారు. పోస్టులు ఈ తరహావి పెట్టినా లేక వీడియోలు చేసినా అలా వీడియోలను అప్ లోడ్ చేసినా వైరల్ చేసినా వీరంతా ఇక మీదట చట్టానికి చిక్కి విలవిలలాడాల్సిందే అని అంటున్నారు.
