మొన్నటి వరకు మావోల అడ్డా.. ఇప్పుడు సినిమా షూటింగ్ లు
అవును..ఇప్పటివరకు మీరు చదివింది అక్షరాల నిజం. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్ మడ్ ఒకప్పుడు పిస్టల్ కాల్పులతో మోత మోగేది.
By: Garuda Media | 4 Nov 2025 1:00 PM ISTమొన్నటి వరకు అది మావోల అడ్డా. ఇప్పుడు సీన్ మారింది. ఓవైపు మావోలు.. మరో వైపు వారిని వెతికే ప్రత్యేక దళాలు. ఎప్పుడు ఏమవుతుందో తెలీని పరిస్థితి. అటు వైపు వెళ్లటానికి సైతం సంకోచం.. మనకెందుకు లేనిపోని తలనొప్పులు అన్నట్లుగా ఉన్న ప్రాంతం కాస్తా.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాల్పులు.. ఎదురు కాల్పులు.. బూట్ల చప్పుళ్లతో నిత్యం ఏదో ఒక టెన్షన్ తో తల్లడిల్లిన ప్రాంతంలో ఇప్పుడు సినిమా షూటింగ్ లు ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి.
అవును..ఇప్పటివరకు మీరు చదివింది అక్షరాల నిజం. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్ మడ్ ఒకప్పుడు పిస్టల్ కాల్పులతో మోత మోగేది. మావోలకు అడ్డగా ఉన్న ఆ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక అలజడి సాగేది. తరచూ రక్తపాతంతో ఆ ప్రాంతం భయభ్రాంతులకు గురి చేసేది. హింస రాజ్యమేలే ఆ ప్రాంతంలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలా చేశాయి.
దీర్ఘకాలం పాటు సాగిన ఈ ఆపరేషన్ తో మావోలు చెల్లాచెదురు కావటం.. పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు చోటు చేసుకోవటం.. అగ్రనాయకులు మొదలు ఒక మోస్తరు నాయకులు.. వారి అనుచరగణం పోలీసుల ఎదుట లొంగిపోవటంతో.. మావోలకు అడ్డాగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు సాగుతున్నాయి.
సహజసిద్ధమైన ప్రక్రతి అందాలు.. దట్టమైన అడవులు. చూడచక్కని కొండ ప్రాంతాలు.. పచ్చిక బయళ్లతో ఉండే ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొనటంతో మాస్ పుర్ ప్రాంతంలో సినిమా షూటింగ్ లతో కళకళలాడుతున్నాయి. అందుకు నిదర్శనంగా దండా కోటుమ్ అనే సినిమా షూటింగ్ ఇప్పుడు అక్కడ స్వేచ్ఛగా సాగుతోంది. మాస్ పుర్ కు 200 మీటర్లదూరంలో ఉన్న పోలీస్ క్యాంప్ కు దగ్గర్లోనే సాగుతున్న సినిమా షూటింగ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. చాలా వేగంగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. బస్తర్ ప్రాంతంలో మారిన పరిస్థితులకు ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు.
