కశ్మీర్ లో లష్కరే షాకింగ్ ప్రకటన.. తెరపైకి హిందువులకు కొత్త ముప్పు!
ఆపరేషన్ సిందూర్ అనంతరం కలుగులో ఎలుకల్లా కాస్త సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గత కొన్ని రోజులుగా మళ్లీ వాయిస్ పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు.
By: Raja Ch | 15 Jan 2026 12:54 AM ISTఆపరేషన్ సిందూర్ అనంతరం కలుగులో ఎలుకల్లా కాస్త సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గత కొన్ని రోజులుగా మళ్లీ వాయిస్ పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా.. జమ్మూ కాశ్మీర్ లో హింసాత్మక జిహాద్ కు తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది! ఈ సందర్భంగా... హిందువులపై సామూహిక హింసను ప్రేరేపించే జాతి విద్వేషపూరిత ప్రసంగం చేశాడు సీనియర్ కమాండర్!
అవును... తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ముసా.. హిందువులే లక్ష్యంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా.. కాశ్మీరీ హిందువుల గొంతు కోయాలని పిలుపునిచ్చాడు.. కాశ్మీర్ సమస్యను జిహాద్ ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని పేర్కొన్నాడు! తాజాగా సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలో.. అక్కడ కాశ్మీరీలు భిక్షాటన చేయడం ద్వారా స్వేచ్ఛ లభించదని.. హిందువుల గొంతు కోయడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ లభిస్తుందని చెప్పడం గమనార్హం!
పైగా తాను ఈ అభిప్రాయాలను పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఇతర సీనియర్ మంత్రులకు వ్యక్తిగతంగా తెలియజేశానని అబు ముసా పేర్కొన్నాడు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జేకేయూఎం (జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూవ్ మెంట్) తో సంబంధం ఉన్న కాశ్మీరీ, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని రావలకోట్ జిల్లాలోని పూంచ్ ప్రాంతంలోని హజీరా తహసీల్ లోని బహిరా గ్రామంలో ఈ కార్యక్రమం జరిగినట్లు చెబుతున్నారు!
ఇలా ఈ తీవ్రమైన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏ స్థాయిలో ప్రోత్సహిస్తోందనే విషయంలో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇలా బహిరంగ వేదికల నుండి ప్రసంగాలు చేయగలిగే కార్యక్రమాలు.. పాక్ అధికారులకు తెలియకుండానే, వారి అనుమతులు లేకుండానే జరుగుతున్నాయా అనే ప్రశ్ననూ లేవనెత్తుతున్నాయి.
కాగా... పహల్గాం ఉగదాడికి ముందూ అబూ ముసా ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వీడియోను కేవలం రెచ్చగొట్టే ప్రసంగంలా మాత్రమే చూడకుండా.. పెద్ద ఉగ్రవాద కుట్రకు సంకేతంగా చూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించాయని.. సంకేతిక విశ్లేషణ, నెట్ వర్క్ ట్రాకింగ్ లు ప్రారంభించాయని తెలుస్తోంది!
