అబుదాబి ఎయిర్ పోర్టులో హెచ్1బీ క్యాన్సిల్?
ఇటీవల సోషల్ మీడియా వేదికగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గ్రూపుల్లో ఒక వార్త కార్చిచ్చులా వ్యాపించింది.
By: A.N.Kumar | 25 Feb 2026 10:23 AM ISTఇటీవల సోషల్ మీడియా వేదికగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గ్రూపుల్లో ఒక వార్త కార్చిచ్చులా వ్యాపించింది. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో యూఎస్ ప్రీ-క్లియరెన్స్ సమయంలో ఒక హెచ్1బీ ఉద్యోగి వీసాను అక్కడికక్కడే రద్దు చేసి అతడిని వెనక్కి పంపించారనేది ఆ వార్త సారాంశం. కేవలం "ఇండియా నుండి రెండు నెలలు రిమోట్ వర్క్ చేశాను" అని ఆ ఉద్యోగి నిజాయితీగా చెప్పడమే అతడి పాలిట శాపమైందని సదరు పోస్ట్ పేర్కొంది. ఈ ఘటన ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే ఇది వేలాది మంది హెచ్1బీ వీసాదారులలో ఆందోళనను అనేక సందేహాలను రేకెత్తించింది.
చట్టం ఏం చెబుతోంది? రిమోట్ వర్క్ తప్పా?
సాధారణంగా హెచ్1బీ వీసా అనేది ఒక నిర్దిష్ట యజమాని వద్ద ఒక నిర్దిష్ట ప్రదేశంలో పనిచేయడానికి ఇచ్చే అనుమతి. ఈ వివరాలన్నీ ఎల్.సీఏ (లేబర్ కండిషన్ అప్లికేషన్) లో స్పష్టంగా పొందుపరుస్తారు. ఒక ఉద్యోగి తన ఆమోదించబడిన పని ప్రదేశం నుండి కాకుండా వేరే చోట నుండి పనిచేస్తే అది సాంకేతికంగా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. కోవిడ్ తర్వాత 'వర్క్ ఫ్రమ్ హోమ్' లేదా 'రిమోట్ వర్క్' సంస్కృతి పెరిగింది. కానీ అంతర్జాతీయ సరిహద్దులు దాటి మరో దేశం నుండి పనిచేయడం అనేది అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం గ్రే ఏరియాలో ఉన్న అంశం. ఇండియాలో ఉండి యూఎస్ కంపెనీకి పనిచేస్తూ డాలర్లలో జీతం పొందడం వల్ల అమెరికాలోని స్థానిక పన్ను నిబంధనలు లేదా లేబర్ చట్టాలు ప్రభావితం అవుతాయని ఇమిగ్రేషన్ అధికారులు భావిస్తారు. "రిమోట్ వర్క్ చేశాను" అని చెప్పినప్పుడు అది ఎల్.సీఏ లో పేర్కొన్న పని ప్రదేశానికి విరుద్ధమని వారు పరిగణించే అవకాశం ఉంది.
అబుదాబి ఘటనలో అసలేం జరిగి ఉండవచ్చు?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సదరు ఉద్యోగిని సెకండరీ ఇన్స్పెక్షన్ కు పంపారు. అక్కడ అధికారులు అడిగే ప్రశ్నలు చాలా లోతుగా, తార్కికంగా ఉంటాయి. ఇండియాలో ఉన్న సమయంలో కంపెనీ సెలవు ఇచ్చిందా? లేక మీరు పనిచేశారా? విదేశాల్లో ఉండి పనిచేస్తున్నప్పుడు ఆ దేశపు పన్ను నిబంధనలు పాటించారా? హెచ్1బీ వీసా అనేది అమెరికాలో ఉండి సేవలు అందించడానికి ఉద్దేశించినది. మీరు బయట నుండే పని చేయగలిగినప్పుడు, మీకు వీసా ఎందుకు? అనే కోణంలో అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ తర్కంతోనే ఆ ఉద్యోగి వీసాపై "క్యాన్సిల్డ్ మరియు విత్ డ్రా’’ అని ముద్ర వేసి ఉండవచ్చు. ఇది బహిష్కరణ కాకపోయినప్పటికీ ఆ వీసా చెల్లకుండా పోతుంది.
ప్రవాస భారతీయులకు నిపుణుల సూచనలు
ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే హెచ్1బీ ఉద్యోగులు కొన్ని కఠినమైన జాగ్రత్తలు పాటించక తప్పదు. మీ ఎల్.సీఏ లో ఏ లొకేషన్ ఉందో గమనించండి. మీ కంపెనీ పాలసీ మీకు రిమోట్ వర్క్ అనుమతించినా అది ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి ఉందో లేదో మీ కంపెనీ లాయర్‌ను అడిగి తెలుసుకోండి. ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అతిగా మాట్లాడటం ప్రమాదకరం. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. "నేను సెలవులపై ఇండియా వెళ్లాను" అని చెప్పడం కంటే "అక్కడి నుండి రిమోట్ వర్క్ చేశాను" అని అనవసరమైన సమాచారం ఇవ్వడం సమస్యలకు దారి తీయవచ్చు. మీరు ఇండియాకు వెళ్లేటప్పుడు కేవలం సెలవుల మీద వెళ్తున్నారా లేక పని చేస్తారా అనే విషయంలో మీ ఎంప్లాయర్‌తో స్పష్టమైన ఒప్పందం ఉండాలి. ఐ-797.. ప్రస్తుత పే-స్లిప్స్, ఉద్యోగ ధృవీకరణ పత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఒక్కోసారి అతిశయోక్తిగా ఉండవచ్చు.. కానీ వాటి వెనుక ఉన్న హెచ్చరికను గమనించడం ముఖ్యం. హెచ్1బీ వీసా అనేది ఒక హక్కు కాదు.. అది ఒక సదుపాయం మాత్రమే. చట్టాల పట్ల అవగాహన లేకపోవడం రేపు మీ కెరీర్‌ను రిస్క్‌లో పడేయవచ్చు. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేసే ముందు పక్కాగా ప్లాన్ చేసుకోవడం నిపుణుల సలహాలు తీసుకోవడం అత్యవసరం. జాగ్రత్తే భద్రత.. ఇమిగ్రేషన్ విషయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది!
