ప్రధాని మోదీకే సవాల్.. నెక్ట్స్ లెవల్ కు కాక్రోచ్ పార్టీ ఉద్యమం!
జాతీయ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, అజేయ శక్తిగా కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురవుతోంది.
By: Tupaki Political Desk | 19 Jun 2026 1:40 PM ISTజాతీయ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, అజేయ శక్తిగా కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురవుతోంది. ఇప్పటివరకు విపక్షాల నుంచి మాత్రమే విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని తొలిసారిగా 'జెన్ జీ' తరం నుంచి నేరుగా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. వరుసగా జాతీయస్థాయిలో పరీక్షల వైఫల్యాలు, నీట్ ప్రశ్నపత్రాల లీకుల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే ఏకంగా ప్రధాని మోదీనే లక్ష్యం చేసుకుని లేఖ రాయడం సంచలనం రేపుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకు కారణంగా ఆత్మస్థైర్యం కోల్పయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతోందని అంటున్నారు.
మారుతున్న పోరాట దిశ
ఆన్ లైన్ సంచలనం కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయి ఉద్యమం తర్వాత తమ పోరాటాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేసిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు.. ఇప్పుడు తమ స్వరాన్ని మరింత గట్టిగా వినిపించడం తీవ్ర సంచలనంగా చెబుతున్నారు. తమ ఆందోళనలను కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్న భావనకు వచ్చిన కాక్రోచ్ పార్టీ నేతలు ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం చూస్తుంటే ఈ నిరసనలు క్రమంగా బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
తమ నిరసనలతో ఏకంగా దేశ అగ్రనాయకత్వంపై జెన్ జీ ఎదరించేలా లేఖ రాయడం చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు నాంది పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి కేవలం పాలనాపరమైన సవాళ్లే కాకుండా, యువత నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఆయన ఏం చేయనున్నారనేది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.
రాజకీయంగా కీలకమే..
కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ఉన్న ప్రభుత్వానికి ఈ చిన్న నిరసనలు పెద్దగా అనిపించకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఒక దేశంలో యువతరం ఒక నిర్దిష్ట సమస్యపై గళం విప్పితే, అది కాలక్రమేణా పెద్ద ఉద్యమంగా మారే ప్రమాదం ఉందని చరిత్రను గుర్తు చేస్తున్నారు. అభిజిత్ దీప్కే వంటి యువ నాయకులు సృష్టించిన ఈ 'జెన్ జీ' సెగ, ప్రధాని మోదీకి ఒక ముందస్తు హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యను ప్రధాని మోదీ ఎలా చూస్తారు? ఎలా చక్కదిద్దుతారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంటున్నారు.
