Begin typing your search above and press return to search.

ఆట మోస‌మని తెలిసీ.. మీరెందుకు ఆడుతున్నారు!

''ఆట మోస‌మ‌ని తెలిసిన త‌ర్వాత‌.. ఏ క్రీడాకారుడు కూడా ఆట‌ల్లో భాగ‌స్వామి కాడు. కానీ, మీరు మాత్రం భాగ‌స్వాములు అవుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు.''

By:  Garuda Media   |   25 Sept 2026 11:14 PM IST
ఆట మోస‌మని తెలిసీ.. మీరెందుకు ఆడుతున్నారు!
X

``ఆట మోస‌మ‌ని తెలిసిన త‌ర్వాత‌.. ఏ క్రీడాకారుడు కూడా ఆట‌ల్లో భాగ‌స్వామి కాడు. కానీ, మీరు మాత్రం భాగ‌స్వాములు అవుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు.`` అని కాంగ్రెస్ పార్టీ స‌హా.. అన్ని ప్ర‌తిప‌క్షాల‌ను కాక్రొచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే ప్ర‌శ్నించా రు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విప‌క్షాల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. ఎన్నిక‌ల సంఘంలో లుక‌లుక‌లు బ‌య‌ట ప‌డిన త‌ర్వాత‌.. కానీ విప‌క్షాలు క‌ళ్లు తెర‌వ‌డం లేద‌న్నారు. పోనీ తెరిచినా.. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌లేక పోతున్నాయ‌ని ఆక్షేపించారు. ఎన్నిక‌లు పూర్తిగా ఒక‌వైపే జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు.

ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త లేన‌ప్పుడు.. ఈవీఎంల‌ను మాయ చేస్తున్న‌ప్పుడు.. వాటి ఉచ్చులో మీరెందుకు చిక్కుకుంటున్నార‌ని ఆయ‌న విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. కేవ‌లం పార్టీల‌ను కాపాడుకునేందుకు, నేత‌ల‌ను కాపాడుకునేందుకు మాత్ర‌మే పార్టీలు ఇలా చేస్తున్నా యని వ్యాఖ్యానించారు. అయితే.. ఇలా కాపాడుకుని ఏం చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. దేశంలో జరుగుతున్న ఎన్నిక‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని మేధావులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని దీప్కే వ్యాఖ్యానించారు. అయినా.. పార్టీలు పోటీ చేస్తున్నాయ‌ని చెప్పారు. ఓట్లు దొంగ‌త‌నం జ‌రుగుతుంద‌ని తెలుస్తున్నా.. ఎందుకు పోటీ చేయ‌డ‌మ‌ని అన్నారు.

మీరు దూరంగా ఉంటే..

ఎన్నిక‌ల్లో పోటీకి విప‌క్షాలు పూర్తిగా ఉంటే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియే నిలిచిపోతుంద‌ని.. త‌ద్వారా కొంప‌లేమీ మునిగిపోవ‌ని దీప్కే వ్యాఖ్యానించా రు. మ‌హా అయితే.. కొంత ఆల‌స్యం జ‌రుగుతుంద‌న్నారు. కానీ.. పారద‌ర్శ‌క‌త విష‌యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు. ఈ విష‌యంపై కాంగ్రెస్ స‌హా అన్ని ప‌క్షాలు ఆలోచ‌న చేయాల‌న్నారు. చేతులు కాల‌క ముందే.. జాగ్ర‌త్త‌లు తీసుకునేలా చూడాల‌న్నారు. అన్ని అయిపోయిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల్లో ఏదో జ‌రిగింద‌ని ఆవేద‌న చెంద‌డం వృథా అని పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌నునిరోధించాలంటే ఖ‌చ్చితంగా పార్టీలు పోటీకి దూరంగా ఉండాల‌ని సూచించారు.

సాధ్య‌మేనా?

అయితే.. ఎన్నిక‌ల్లో పోటీకి పార్టీలు దూరంగా ఉండాల‌న్న‌ది ఇప్ప‌టి మాట కాదు. ఎన్నిక‌ల సంఘంపై అనుమానాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా జ‌రిగింది. అయితే.. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఎన్నిక‌లు కీల‌కం కావ‌డం.. పార్టీల మ‌నుగ‌డ కూడా ప్రాధాన్యం కావ‌డంతో ఏ పార్టీ కూడా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. సో.. అభిజిత్ దీప్కే వంటి వారు.. పిలుపునిచ్చినా.. వ్య‌వ‌స్థ‌ల్లో ఆ మేర‌కు మార్పు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ రాజ్యాంగం ప్ర‌కారం జ‌రిగిపోతుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. సో.. పార్టీలు కూడా దానిని అనుస‌రించ‌క త‌ప్ప‌దు.