Begin typing your search above and press return to search.

ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశీ విద్య, సీజేపీ నిధులపై అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన

సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చీఫ్ జస్టిస్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే విదేశీ విద్య, నిధుల సమీకరణపై అనేక చర్చలు, విమర్శలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

By:  A.N.Kumar   |   3 Aug 2026 1:09 PM IST
ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశీ విద్య, సీజేపీ నిధులపై అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన
X

సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చీఫ్ జస్టిస్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే విదేశీ విద్య, నిధుల సమీకరణపై అనేక చర్చలు, విమర్శలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించి తన విదేశీ విద్యకు సంబంధించిన ఆర్థిక వివరాలతో పాటు పార్టీ నిర్వహణ నిధులపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు.

విదేశీ విద్యకు భారీ స్కాలర్‌షిప్.. లోన్

తన చదువు కోసం విదేశీ నిధులు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారానికి అభిజీత్ దీప్కే చెక్ పెట్టారు. అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించేందుకు తనకు అధికారికంగా స్కాలర్‌షిప్ లభించిందని వెల్లడించారు. స్కాలర్‌షిప్ విలువ.. సుమారు రూ. 35.77 లక్షలు అని దీనికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్‌ను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. అయితే కేవలం స్కాలర్‌షిప్‌తో విదేశాల్లో మొత్తం ఖర్చులు భరించడం సాధ్యం కాకపోవడంతో మిగిలిన చదువు వ్యయం కోసం బ్యాంక్ నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ రుణాన్ని తాను క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నానని.. విదేశీ విద్యకు సంబంధించిన ప్రతి రూపాయి లావాదేవీ చట్టబద్ధంగానే జరిగిందని స్పష్టం చేశారు.

సీజేపీ కార్యకలాపాలకు నిధులు ఎలా వస్తున్నాయి?

అలాగే సీజేపీ పార్టీ నిర్వహణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అవగాహన సదస్సులకు సంబంధించి నిధుల సమీకరణపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. "పార్టీ నిర్వహణ అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. దీని కోసం మేము కేవలం క్రౌడ్ ఫండింగ్ విధానాన్నే నమ్ముకున్నాం. సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే చిన్న చిన్న విరాళాల ద్వారానే సంస్థ ప్రతి కార్యక్రమం కొనసాగుతోంది." అని అభిజీత్ దీప్కే తెలిపారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

అభిజీత్ దీప్కే ఆధారాలతో సహా వివరణ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. స్కాలర్‌షిప్ పత్రాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తూ ఆయన పారదర్శకతను అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం పార్టీ క్రౌడ్ ఫండింగ్ లెక్కలపై మరిన్ని వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.

మొత్తానికి విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ , బ్యాంక్ లోన్, పార్టీ కార్యకలాపాలకు ప్రజల క్రౌడ్ ఫండింగ్ మాత్రమే ఆధారమని తెల్చిచెప్పడం ద్వారా అభిజీత్ దీప్కే తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు.