సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ చేసిన ఫిర్యాదుతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మరోసారి వార్తల్లో నిలిచారు.
By: A.N.Kumar | 4 Aug 2026 1:48 PM ISTసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ చేసిన ఫిర్యాదుతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై పూణె, ఔరంగాబాద్ ప్రాంతాల్లో జరిగిన దాడుల వెనుక అభిజీత్ దీప్కే అనుచరుల ప్రమేయం ఉందంటూ ఫైజాన్ అన్సారీ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించిన ఆయన, అభిజీత్ దీప్కేపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను కోరారు.
ఫైజాన్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరగలేదని, వీటి వెనుక అభిజీత్ దీప్కేకు చెందిన వ్యక్తుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని పోలీసులను కోరారు. అలాగే ప్రజలు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో ఢిల్లీలో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావించిన ఫైజాన్ అన్సారీ, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. చట్టవ్యవస్థను కాపాడేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ ఆరోపణలపై స్పందించిన అభిజీత్ దీప్కే వాటిని పూర్తిగా ఖండించారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తమ సంస్థ ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పనిచేయదని.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా విద్యార్థుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరు అయినా విద్యార్థుల సంక్షేమమే తమ సంస్థకు ముఖ్యమని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ సంస్థ పేరును వివాదాల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఫైజాన్ అన్సారీ చేసిన ఫిర్యాదును ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో అభిజీత్ దీప్కేపై ఎలాంటి అరెస్ట్ లేదా అధికారిక చర్య జరిగినట్లు పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
