'ABV - ఏ బెటర్ విజయవాడ'.. ఏబీవీ వినూత్న ప్రచారం!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
By: Tupaki Political Desk | 23 Oct 2026 3:22 PM ISTవిజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అధికార, విపక్షాల మధ్య ద్విముఖ పోరు ఉంటుందనే అంచనాలను తలకిందులు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు రేసులోకి దూసుకొచ్చారని అంటున్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఏబీవీ చూపిస్తున్న దూకుడు ప్రధాన పార్టీలకు మతిపోగొడుతుందని అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏబీవీ చేస్తున్న ప్రచారంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని చెబుతున్నారు. దీంతో ఏబీవీని నిలువరించడానికి అధికార పక్షం సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగాల్సివచ్చిందని అంటున్నారు. ఒకప్పుడు టీడీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన ఏబీవీ ఇప్పుడు ఎదురు తిరగడమే కాకుండా, ఏ మాత్రం మింగుడు పడని విమర్శలతో విరుచుకుపడుతున్న తీరు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకున్న ఏబీవీ రోజూ పదుల కొద్ది వీడియోలతో విజయవాడ ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోందని అంటున్నారు. ప్రధానంగా తన పేరుతోనూ ఆయన వినూత్న ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఏబీవీ అంటే.. ఏ బెటర్ విజయవాడ అంటూ ప్రచారం చేయడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సారి ఏబీవీకి ఓటు వేద్దామని పిలుపునిస్తున్న ఏబీవీ క్షేత్రస్థాయి పర్యటనలలోనూ జోరు చూపిస్తున్నారు. తనకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ప్రతిరోజూ పదుల కొద్ది వీడియోలను ఆయన అప్ లోడ్ చేయడం, వాటిని జెన్ జీ యువత, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా షేర్ చేస్తుండటం కూడా ఎన్నికల రణరంగాన్ని ఆసక్తికరంగా మార్చేసిందని అంటున్నారు.
చందాలతో కొత్త పంథా
ఎన్నికలు అంటేనే డబ్బుతో పని. డబ్బు లేనిదే ఎవరూ ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టలేరు. నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ఇలా ప్రతి దశలోనూ లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. వెంట తిరిగే వారికి మందు, విందుతో సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ప్రధాన పార్టీలు ఈ ఖర్చులకు భయపడి ఆర్థికంగా తట్టుకోగలవారిని ఏరికోరి అభ్యర్థులుగా ఎంపిక చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏబీవీ వినూత్న పంథాతో ప్రజల్లోకి వెళుతున్నారు. తాను ఎన్నికల కోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయనని చెబుతూ, ఎన్నికల ప్రచారంలో అవసరమయ్యే డబ్బును ప్రజల నుంచే సేకరించేందుకు సిద్దమయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన బ్యాంకు అకౌంటు వివరాలు షేర్ చేసి తనకు ఫండింగ్ చేయాలని కోరుతున్నారు. దీనివల్ల ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు సేకరించడమే కాకుండా, అలా చందాలు ఇచ్చిన వారు ఓటు వేయడమే కాకుండా, తమకు తెలిసిన వారిని మోటివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనివల్ల సైలెంటుగా ఓటింగ్ విప్లవం సృష్టించేలా ఏబీవీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
వినూత్న ప్రచారం
సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ, మిగిలిన అభ్యర్థులు కన్నా ప్రచారంలో ముందు కనిపిస్తున్నట్లు ఏబీవీ క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ దూకుడు చూపుతున్నారు. ఉదయాన్నే వాకర్స్ తో మొదలుపెట్టి సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికొచ్చే సాధారణ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిని కలిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వన్ టు వన్ కలిసే సమయంలో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడుతూ తన కోసం ఎక్కువ చర్చ జరిగేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రజల ముందే చర్చిద్దాం… నిజానిజాలు తేల్చుకుందాం.. అన్నట్లు ప్రత్యర్థులకు సవాల్ విసరడమే కాకుండా 9 లక్షల ఓటర్లు ఉన్న విజయవాడలో తనకు ఒక లక్ష మంది మద్దతు ఇచ్చానా, ఈ నగరంలో నిజాయితీ పరులైన లక్ష మంది ఓటర్లు ఉన్నారనే గుర్తింపు తేవచ్చునని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త వ్యూహం, ప్రత్యర్థులకు విసురుతున్న సవాళ్లు విజయవాడ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయోనన్న ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.
