ఏబీవీకి టీడీపీ నో...అందుకేనా ఇలా ?
ఇక ఏబీవీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారు అని అంతా భావించారు. ఆయనకు టీడీపీలో ఎంతో మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారు కూడా.
By: Satya P | 22 Oct 2026 11:25 PM ISTఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నతాధికారిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. అయితే ఆయన పదవీ విరమణ తరువాత రాజకీయాల వైపు ఆసక్తిని చూపించారు. ఆ మాటకు వస్తే ఏబీవీ ఉన్నతాధికారిగా ఉండగానే టీడీపీకి అనుకూలురు అన్న ముద్రను వైసీపీ వేసింది. ఈ కారణంగానే వైసీపీ అధికారంలోకి రాగానే ఏబీవీని లూప్ లైన్ లో పెట్టింది. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు ఏబీవీ ఎంతో వేదన పడ్డారు. ఆయన మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది. అయితే ఆయన ఎక్కడా తగ్గకుండా న్యాయ పోరాటం చేసి సస్పెన్షన్ నుంచి బయటపడ్డారు. అయితే ఈ క్రమంలో ఆయన పదవీ విరమణ కూడా చేయాల్సి వచ్చింది.
టీడీపీ కూటమిలో :
ఇక ఏబీవీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారు అని అంతా భావించారు. ఆయనకు టీడీపీలో ఎంతో మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారు కూడా. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. ఏబీవీ టీడీపీలో చేరాలనుకుంటే ఎందుకో అధినాయకత్వం సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. ఎంతో మంది బ్యూరోక్రాట్లను రాజకీయాల్లోకి తెచ్చి ఉన్నత పదవులు ఇచ్చిన చంద్రబాబు ఏబీ వెంకటేశ్వరావు విషయంలో సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఏబీవీనే ఒక చానల్ ఇంటర్వ్యూలో చెబుతూ ఏమో తాను టీడీపీలో ఉంటే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారేమో అందుకే వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు.
సమదూరం పాటిస్తూ :
ఈ క్రమంలో ఏబీవీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పాత్రను పోషిస్తూ రాజకీయాలలో కీలకంగా మారారు. ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని అలాగే వైసీపీని కూడా సమానంగా విమర్శిస్తూ వస్తునారు. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ఆయన ఎత్తి చూపిస్తున్నారు. దాంతో ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడతారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఏపీలో థర్డ్ ఫోర్స్ రావాలని ఏబీవీ ఆకాంక్షించారు. కానీ సడెన్ గా ఆయన విజయవాడ మేయర్ సీటుకు పోటీ చేయడం రాజకీయ సంచలనంగానే అంతా చూస్తున్నారు
కూటమికి ఎదురెళ్ళి :
విజయవాడలో ఒక వైపు కూటమి ఉంది. మరో వైపు వైసీపీ ఉంది. ఈ రెండు పార్టీలను ఢీ కొడుతూ ఇండిపెండెంట్ గా మేయర్ పదవికి ఏబీవీ పోటీ చేయడం మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. రాజకీయాల్లో రాణించాలని తన కంటూ ఒక ప్రత్యేకత సాధించాలని ఏబీవీ చూస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుంది అన్నది చాలా మందిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అందరికీ పరిచయం ఉండాలి. క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండాలి. పైగా మేయర్ కి డైరెక్ట్ పోటీ అని అనుకున్నా వార్డులలో కార్పోరేటర్ అభ్యర్ధుల బలం కూడా తోడు అవుతుంది. అలాంటిది ఏదీ లేకుండా డైరెక్ట్ గా బరిలోకి దిగడం అంటే రిస్క్ అనే అంటున్నారు. పైగా ఏబీవీ రాజకీయ పార్టీతో వచ్చి 2029 ఎన్నికల్లో ఏదో చేస్తారు అనుకుంటే మేయర్ పదవిలోనే తన ప్రతిష్ట ఫణంగా పెట్టుకుంటే ఎలా అన్న చర్చ కూడా వస్తోంది. మరి ఈ మాజీ ఐపీఎస్ అధికారి, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ కి వ్యూహాలు లేకుండా ఉంటాయా అన్నది కూడా మరో చర్చ. సో ఏబీవీ రాజకీయ వ్యూహాలు ఏమిటి అన్నదే చూడాలని అంటున్నారు.
