విజయవాడ మేయర్...బరిలోకి ఏబీవీ !
విజయవాడ అంటేనే రాజకీయం వేడిగా ఉంటుంది. అలాంటిది ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారు పోటీకి దిగుతూండడంతో మరింతగా హీట్ పెరగడం ఖాయమని అంటున్నారు.
By: Satya P | 18 Oct 2026 9:07 AM ISTవిజయవాడ రాజకీయాలు సంచలనం కాబోతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు ఆయన ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలను కాంగ్రెస్ పార్టీని ఆయన కోరుతున్నారు. ఏపీలో కూటమికి వైసీపీకి వ్యతిరేకంగా మూడవ ఫోర్స్ రావాలని కావాలని కోరుకుంటూ వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయ రాజధానిలోనే లెక్క తేల్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
కాంగ్రెస్ తప్పుకుని మరీ :
ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ మేయర్ పదవికి జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని ప్రకటించిన వెంటనే ఆయనకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు తమ ఉమ్మడి మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావును ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకి లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించి విజయవాడ మేయర్ పోటీ నుండి తప్పుకుని ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ఆయన ఇండిపెండెంట్ గా కాదని ఇండియా కూటమి తరఫున అభ్యర్ధిగా వస్తున్నారని అంటున్నారు.
వేడెక్కిన బెజవాడ :
విజయవాడ అంటేనే రాజకీయం వేడిగా ఉంటుంది. అలాంటిది ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారు పోటీకి దిగుతూండడంతో మరింతగా హీట్ పెరగడం ఖాయమని అంటున్నారు. ఆయన సామాజిక వర్గం కోణం నుంచి చూస్తే సమీకరణలు కూడా మారుతాయని అంటున్నారు. విజయవాడలో ఒక బలమైన సామాజిక వర్గం అయితే మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున మేయర్ పీఠం ఆశించి భంగపడింది. అలాగే కూటమిలో అసంతృప్తి ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ బలమైన సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు అనూహ్యంగా బరిలోకి దిగడం అంటే ఇది రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నారు.
వారికి వ్యతిరేకంగా :
ఇక విజయవాడ మేయర్ సీటుని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున వంగవీటి రాధాక్రిష్ణ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పోటీ పడుతున్నారు. అటు కూటమిని ఇటు వైసీపీని వ్యతిరేకిస్తూ ప్రజల కోసం ప్రజల పక్షాన పోటీకి దిగుతున్నామని అందుకే తాను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రౌండ్ టేబిల్ సమావేశాలతో ఏపీలో థర్డ్ ఫ్రంట్ రావాలని గట్టిగా కొరుకుంటూ వస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు ఇండియా కూటమి మద్దతుతో పోటీకి దిగడం ద్వారా రాష్ట్ర రాజకీయాలకు గుండె కాయ లాంటి బెజవాడ నుంచే పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది.
