ఆపరేషన్ 22A - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ సరికొత్త ఉద్యమం!
రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిన 22A భూముల అంశంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) రాష్ట్రవ్యాప్తంగా సంచలన పోరుకు తెరలేపారు.
By: Tupaki Political Desk | 23 July 2026 5:55 PM ISTరాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిన 22A భూముల అంశంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) రాష్ట్రవ్యాప్తంగా సంచలన పోరుకు తెరలేపారు. ‘రోల్ బ్యాక్ 22A’ నినాదంతో ఆయన చేపట్టిన ఈ ఉద్యమం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వేలాది ఎకరాల భూములను 22A నిషేధిత జాబితా కింద చేర్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారసత్వంగా వచ్చిన భూములతో పాటు, రైతులు తమ స్వార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ భూములను రాజకీయ దురుద్దేశంతోనే అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారనే ఆరోపణలతో ఏబీవీ ప్రస్తుతం ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల వద్దకు వస్తున్న వారిలో ఎక్కువ మంది 22A బాధితులే ఉంటున్నారని ఏబీవీ చెబుతున్నారు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి విముక్తి కల్పిస్తామన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిబంధనలను బూచిగా చూసి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కారించడం లేదని ఏబీవీ ఆరోపిస్తున్నారు. దీంతో కొందరు సామాజిక కార్యకర్తలను కలుపుకుని ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారని చెబుతున్నారు.
22ఏపై బాధితుల తరఫున పోరాడాలని నిర్ణయించిన ఏబీవీ ముందుగా తిరుపతిలో ప్రత్యేకంగా 'ఆస్తి హక్కుల సేవా కేంద్రం'ను అందుబాటులోకి తెచ్చారు. ‘‘నా ప్రాణం నా హక్కు.. నా జీవితం నా హక్కు, నా ఆస్తి నా హక్కు’’ అంటూ కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆయన గళం విప్పారు. నోటీసులు ఇవ్వకుండా నిషేధిత జాబితాలో చేర్చిన భూములు విడుదల కావాలంటే ముఖ్యమంత్రి అనుమతి కావాలా అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన పోరుబాట పట్టారు. ఈ ఉద్యమంలో భాగంగా ఏబీవీ తన బృందంతో కలిసి జిల్లాల వారీగా పర్యటిస్తూ బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు.
ఐపీఎస్ హోదాలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీవీ స్వయంగా రంగంలోకి దిగి కలెక్టర్లను కలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కొందరు కలెక్టర్లు సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తుండగా, మరికొందరు నిబంధనల పేరిట చేతులెత్తేస్తున్నారు. ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, 22A ను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే దీనికి ఏకైక పరిష్కారమని ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఈ సమస్యపై పూర్తిస్థాయిలో చొరవ తీసుకుని పోరాడకపోవడంతో, కోట్లు విలువ చేసే తమ భూములను దక్కించుకునేందుకు బాధితులు పెద్దఎత్తున ఏబీవీని ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
