తగ్గేదేలే అంటున్న ఏబీవీ.. తాజాగా ‘షిర్డీసాయి’పై ఫైట్
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారశైలి అంతుచిక్కడం లేదు. నిన్నమొన్నటివరకు అధికార కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఏబీవీ.. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఫోకస్ చేశారు.
By: Tupaki Political Desk | 27 Oct 2025 1:12 PM ISTరిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారశైలి అంతుచిక్కడం లేదు. నిన్నమొన్నటివరకు అధికార కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఏబీవీ.. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఫోకస్ చేశారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో జరిగిన భారీ అవినీతి కారణంగానే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతోందని చెబుతున్న ఏబీవీ ప్రముఖ విద్యుత్ రంగ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ను టార్గెట్ చేశారు. తిరుపతిలో రౌండు టేబుల్ సమావేశం నిర్వహించి ఆ సంస్థ వల్ల ప్రజలు లక్ష కోట్ల భారాన్ని మోస్తున్నారని ఫైర్ అయ్యారు.
కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి సంస్థ యాజమాన్యానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏబీవీ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సస్పెన్షన్ అనుభవించిన ఏబీవీ.. మాజీ సీఎం జగన్ టార్గెట్ గా తన కార్యక్రమాలు ఉంటాయని గతంలో ప్రకటించారు. జగన్ ప్రభుత్వ బాధితులకు అండగా నిలుస్తానని కోడికత్తి కేసు నిందితుడు జె.శ్రీనివాసరావు, కాకినాడలో మరణించిన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. అదేవిధంగా విశాఖలో డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులతోనూ సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను కూడా తప్పుపడుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఏబీవీ వ్యవహారశైలి ప్రభుత్వ పెద్దలను కలవరపెట్టింది. తమతో సన్నిహితంగా ఉండే రిటైర్డ్ ఐపీఎస్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్న వారిని తీవ్రంగా వేధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన ఏబీవీ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ కు మేలు చేయడానికి ‘బనకచర్ల’ను చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారని విమర్శలు గుప్పించి సంచలనం రేపారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన పోలీస్ హౌసింగు బోర్డు చైర్మన్ పదవినీ తీసుకోకుండా తనకు ప్రభుత్వానికి సంబంధం లేదన్న సంకేతాలు పంపారు.
దీంతో ఏబీవీ ప్రభుత్వ పెద్దలపై కినుక వహించారని ప్రచారం జరిగింది. ఆయన కార్యక్రమాలు కూడా క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక కోణం తీసుకోవడంతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వ్యవహారశైలిపై విస్తృత చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏబీవీ మళ్లీ యూటర్న్ తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టేలా పావులు కదిపిన ఆయన ఇప్పుడు మళ్లీ మాజీ సీఎం జగన్ సన్నిహితులపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ‘షిర్డీసాయి’పై ఏబీవీ తాజాగా మొదలుపెట్టిన పోరాటం.. మాజీ సీఎం జగన్ ను కార్నర్ చేయడానికే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏబీపీ చేసిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనూ ‘షిర్డీసాయి’ సంస్థకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఏబీవీ అసలు టార్గెట్ ఎవరన్నది కూడా చర్చకు కారణమవుతోంది.
