ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్లో రాజకీయ బలం లేదా ?
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ ప్రభావంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన విజయవాడ మేయర్ రాజకీయాల్లోకి వచ్చాక క్షేత్రస్థాయి బలం ఎంతనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియా లైకులు, మీడియా ఫోకస్ ఓట్లుగా మారవని, ప్రజల్లో సొంత మద్దతు, బలమైన వ్యవస్థ ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరనే చర్చ సాగుతోంది.
By: Satya P | 5 Nov 2026 1:24 PM ISTసోషల్ మీడియా వచ్చాక అందరూ ఒక్కసారిగా లోకానికి పరిచయం అయిపోతున్నారు. ఒవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. అయితే ఇది ఎలా ఉంది అంటే అంతా పై పై మెరుగులు గానే. తమకు ఎంత ఆదరణ ఉందో అని లైక్స్ ని చూసి మురుస్తున్నారు. తీరా గ్రౌండ్ లోకి దిగాక చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియా భ్రమల నుంచి బయటపడేసరికి డిపాజిట్లు గల్లంతు అవుతున్నాయి. ఇపుడు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసి క్లిక్ అయ్యారు. దాంతో రాజకీయంగా పాపులారిటీ ఉందని నమ్మి విజయవాడ మేయర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే అసలు సీన్ కనిపించింది. గ్రౌండ్ లో రాజకీయ బలం ఏంటో తెలిసిపోయింది అని అంటున్నారు.
సంచలనం వేరు :
సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేసి సంచలనం కావడం వేరు. అదే ప్రజా సమూహం మధ్యకు వెళ్ళి ఎన్నికల్లో పోరాడడం వేరు. ఈ రెండింటికీ ఆకాశానికి నేలకు ఉన్నంత తేడా ఉంది. అందుకే ఏబీవీ దెబ్బ తిన్నారు అని అంటున్నారు. ఒకప్పుడు పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు, పదవీ విరమణ తర్వాత కూడా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామమే. రాజకీయంగా జనాలకు చైతన్య పరచడం అని దీనిని అనుకోవాలి. అలా రాజకీయ అంశాలపై ఆయన స్పందనలు సోషల్ మీడియా పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. అది అక్కడితోనే సరి.
మీడియా బలం వేరు :
మీడియాలో పదే పదే ఫోకస్ అయినంత మాత్రాన నాయకులుగా విజయాలు సాధించలేరు అన్నది అంతా చెప్పే మాట. అదే నిజం అయితే నిత్యం వెండి తెర మీద అలరిస్తూ జనాలకు ఇంకా దగ్గరగా ఉండే సినీ హీరోలు రాజకీయాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఇదే అదే స్టోరీ మరి. ఇక ఏబీ వెంకటేశ్వరరావు విషయానికి వస్తే మీడియాలో కనిపిస్తున్నంత రాజకీయ ప్రభావం ఆయనకు ప్రజలలో లేదా అంటే ఆలోచించాల్సిందే మరి. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ ఒక భాగం. అలా రాజకీయాలపై అభిప్రాయాలు చెప్పడం ప్రతి పౌరుడి హక్కుగా ఉంటుంది. అలాగే మాజీ ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించవచ్చును విమర్శించవచ్చును. ఇది వారికి ఉన్న భావ స్వాతంత్ర్యం మాత్రమే. అయితే ఈ నిరంతరం రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి ప్రభావాన్ని అంచనా వేయాలంటే సోషల్ మీడియా స్పందనలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించాలన్నది తాజాగా ఏబీవీ ఓటమితో మరోసారి చర్చకు వస్తోంది.
లైక్స్ వేరు, జనం మద్దతు వేరు :
ఒక పోస్ట్ ఫేస్బుక్ లో పెడితే వేల లైకులు రావచ్చు అలాగే ఒక వ్యాఖ్యపై టీవీ ఛానళ్లలో గంటల తరబడి చర్చ సైతం సాగవచ్చు. అలాగే ఏబీవీ వంటి మాజీ బ్యూరోక్రాట్ల అభిప్రాయాలకు కొన్ని మీడియా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వవచ్చు, అంత మాత్రం చేత అదంతా ప్రజాదరణగా మారుతుందా ఏకంగా ఓట్ల వర్షం కురిపిస్తుందా అంటే అక్కడే తేడా కొడుతోంది అంటున్నారు. ఏబీవీ వంటి వారు పిలుపునిస్తే ప్రజలు రాజకీయంగా స్పందిస్తారా అలాగే స్థానిక స్థాయిలో ఆయనకు ఎంతమంది మద్దతుదారులున్నారు ఇవన్నీ ప్రశ్నలు,
విజయవాడలో బలమెంత :
ఏబీ వెంకటేశ్వరరావుకు నిజానికి విజయవాడ రాజకీయాల్లో అసలు బలం ఎంత అన్నది ప్రశ్న. ముఖ్యంగా మేయర్ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాలేదనే వాదనను కొందరు ప్రస్తావిస్తున్నారు. అయితే స్థానిక రాజకీయ అంశాల మీద ఆధారపడిన ఆ ఎన్నికల్లో ఏబీవీ వంటి వారు సడెన్ గా బరిలోకి దిగితే ఫలితాలు ఇలాగే వస్తాయని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్త ప్రభుత్వం మీద విమర్శలు ఎవరైనా చేస్తారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పట్టణ ప్రజల సమస్యలపై ప్రశ్నించడం మాత్రమే కాదు, పరిష్కారం కోసం నిరంతరంగా పనిచేసే వ్యవస్థ ఏబీవీకి ఉందా అని కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన అయితే ఒంటరిగానే ఇప్పటికి ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ లాంటిది కూడా లేదు. అలా వ్యక్తిగా ఒక సమస్యపై పోస్టు పెట్టడం, దానిపై చర్చ జరగడం, తర్వాత మరో అంశంపై స్పందించడం ఇదే పద్ధతి కొనసాగితే దాన్ని ప్రజా ఉద్యమంగా పరిగణించగలమా అని కూడా చర్చ సాగుతోంది.
జగన్ మీద విమర్శలతో :
ఏబీవీ జగన్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో జగన్ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్న పరిపాలనా పరమైన వివాదాలు, న్యాయ పోరాటం బహిరంగంగా చర్చకు వచ్చాయి. అలా చూస్తే కనుక జగన్ పాలనపై ఆయన విమర్శలు చేయడం ఆశ్చర్యకరం కాదు. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పనితీరుపై ఆయన ఎంత విమర్శనాత్మకంగా స్పందిస్తున్నారు అన్నది కూడా జనం ఆలోచిస్తారు. అన్ని ప్రభుత్వాలను ఒకే ప్రమాణంతో ప్రశ్నించినప్పుడే స్వతంత్ర ప్రజా విశ్వసనీయత పెరుగుతుంది. అలాంటిది ఆయన ఏ మేరకు సాధించారు అన్నది కూడా ఆయన రాజకీయ భూమిక మీద ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు.
రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి :
మీడియాలో ఎంత పాపులర్ అయినా కావాల్సింది జనం మద్దతు, కానీ ఇటీవల రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి కనిపిస్తోంది. టీవీ చర్చలు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఫేస్బుక్ పోస్టుల ద్వారా కొందరు వ్యక్తులు నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. అలా తమకు తాము హైప్ క్రియేట్ చేసుకుంటూ అదే స్థాయిలో ప్రజాదరణ ఉందని పొరపడుతున్నారు అని కూడా ఉంది. అయితే ఇందులో తేడా ఉంది. రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందడం ఒకటి అయితే ప్రజలను ప్రభావితం చేసే నాయకుడిగా ఎదగడం మరొకటి. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఈ రెండింటి మధ్య తేడాను పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఆ వ్యాఖ్యల ద్వారా ఆయనకు సొంతంగా ఏ మేరకు బలం సమకూరింది అన్నదే ఇక్కడ ప్రధానం. ఆ కోణంలో నుంచి ఆలోచించినప్పుడు ఏబీవీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు.
