Begin typing your search above and press return to search.

రేవంత్ ను అర్వింద్ ఏసుకుంటే.. మోడీపై ఆది శ్రీనివాస్ నిప్పులు

ముఖ్యమంత్రి రేవంత్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.

By:  Garuda Media   |   5 Aug 2026 12:15 PM IST
రేవంత్ ను అర్వింద్ ఏసుకుంటే.. మోడీపై ఆది శ్రీనివాస్ నిప్పులు
X

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మీద బీజేపీ నేతలు కొత్త తరహాలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై.. ప్రసంగించిన సందర్భంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ అర్వింద్ రంగంలోకి దిగారు. మామూలుగానే ఎటకారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేలా వ్యవహరించే ఆయన మాటలు.. ఈసారి మరింత పదునుతో సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.

మామూలుగానే అర్వింద్.. ఆపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన సీఎం రేవంత్ పైనా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని పత్రికల్లో రాయలేని విధంగా ఉన్న పరిస్థితి. అప్లికేషన్ నింపటం రాదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అవహేళన చేస్తారా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్.. రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎన్నికల నామినేషన్ ఫారాన్ని పూరించాలని సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమని.. ఆయన వ్యాఖ్యలు టీచర్లు.. విద్యార్థుల తల్లిదండ్రులను అవమానించేలా ఉన్నాయన్నారు.

సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్తులకు ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. హైడ్రాకు కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అధికారులను రేవంత్ రక్షిస్తున్నట్లుగా మండిపడ్డారు. విద్యార్థులను నిందించటం ఆపేసి.. రైతులను ఆదుకోవటం.. ఎన్నికల హామీలను నెరవేర్చటంపై సీఎం ఫోకస్ పెడితే మంచిదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ నామినేషన్ పత్రాలు కూడా నింపలేరన్న బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ‘‘నామినేషన్ పత్రాల్ని నింపే విషయంలో ప్రధాని మోడీకి.. ముఖ్యమంత్రి రేవంత్ కు పోటీ పెట్టటానికి అర్వింద్ సిద్ధమేనా?’’ అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ చదువు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్.. ముందు ప్రధాన మంత్రి మోడీ ఏం చదివారో ముందు చెప్పాలన్నారు.

ఇప్పటివరకు ప్రధాని మోడీ తన డిగ్రీ సర్టిఫికేట్ ను ఎందుకు చూపించలేదన్న ఆయన.. కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందీ మాట్లాడితే చెవుల్లో నుంచి రక్తం వస్తుందన్నారు. అంతేకాదు.. తెలంగాణ నుంచి మరో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చదువుకున్నారో ఎంపీ అర్వింద్ చెబుతారా? అంటూ ప్రశ్నించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్.. బీజేపీ మధ్య నడుస్తున్న మాటల మంటలు మరింత వరకు వెళతాయో చూడాలి.