అమెరికా పౌరసత్వం వద్దు సార్.. 94 ఏళ్ల వృద్ధురాలి ఇంట్రెస్టింగ్ స్టోరీ
అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం ఎవరైనా వద్దనుకుంటారా? అమెరికా సిటిజన్ గా గుర్తింపు కోసం చాలా మంది పరితపిస్తుంటారు.
By: Tupaki Political Desk | 24 Jun 2026 8:00 PM ISTఅగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం ఎవరైనా వద్దనుకుంటారా? అమెరికా సిటిజన్ గా గుర్తింపు కోసం చాలా మంది పరితపిస్తుంటారు. అమెరికాలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, అమెరికా పౌరసత్వం వద్దనుకుని తన జన్మభూమిలోనే చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటున్నారు బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ. జన్మతః భారతీయురాలు అయినప్పటికీ, మధ్యలో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన మహాలక్ష్మమ్మ మాతృభూమిపై మమకారం చంపుకోలేక మళ్లీ స్వదేశానికి వచ్చేశారు. 8ఏళ్ల క్రితం మళ్లీ మన దేశానికి వచ్చిన మహాలక్ష్మమ్మ అప్పటి నుంచి భారత పౌరసత్వం కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, తన కుటుంబంతో కలిసి 1993లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2000 సంవత్సరంలో ఆమె అమెరికా పౌరసత్వం కూడా పొందారు. కానీ, మాతృభూమిపై మమకారం చంపుకోలేని మహలక్ష్మమ్మ 2018లో తిరిగి సొంత ఊరు వచ్చేశారు. అగ్ర రాజ్యం అమెరికా సౌకర్యాల కంటే, మాతృభూమి గొప్పదని భావించిన మహాలక్ష్మమ్మ తన చివరి మజిలీ సొంత ఊరులో సాగాలని కోరుకుని తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఎట్టకేలకు ఆమె ప్రయత్నాలు ఫలించి మంగళవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో చట్ట ప్రక్రియ పూర్తయింది. 8 ఏళ్ల క్రితమే ఆమె తన పౌరసత్వం పునరుద్ధరించాలని కోరుకున్నా, గతంలో చేసిన దరఖాస్తులో సాంకేతిక లోపం కారణంగా కొంత ఆలస్యమైందని చెబుతున్నారు. ఇక తాజాగా సవరించిన దరఖాస్తు సమర్పించగా, రాష్ట్ర సచివాలయం నుంచి బాపట్ల కలెక్టర్ కు లేఖ అందిందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌరసత్వం ఇచ్చేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను పూర్తి చేయడంతో మంగళవారం మహాలక్ష్మమ్మతో ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉంటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
దీంతో మహాలక్ష్మమ్మ భారత పౌరసత్వానికి ప్రధాన అడ్డంకులు తొలగిపోయినట్లైంది. ఆమె అమెరికా పౌరసత్వం వదులుకుని తిరిగి భారత పౌరసత్వం తీసుకున్న విషయాన్ని కలెక్టర్ కేంద్ర హోంశాఖకు తెలియజేయాల్సివుంటుందని చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ ఈ సమాచారాన్ని అమెరికా ఎంబసీకి పంపుతుందని, వారు మహలక్ష్మమ్మ పౌరసత్వం రద్దు చేసిన తర్వాత ఆమె ఇక్కడ పౌరురాలిగా గుర్తింపు సాధిస్తారని చెబుతున్నారు. మొత్తానికి మహాలక్ష్మమ్మ స్టోరీ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అమెరికా అంటూ వెంపర్లాడే యువతరానికి మహాలక్ష్మమ్మ స్టోరీ గొప్ప పాఠం అంటున్నారు. దేశం విడిచి వెళ్లడమే విజయమని భావిస్తున్న రోజుల్లో 'ఎక్కడికెళ్లినా, ఎంత సంపాదించినా.. మన మట్టి ఇచ్చే తృప్తి, మన ఊరు ఇచ్చే ఆత్మీయత ఎక్కడా దొరకవు' అని నిరూపించారని వ్యాఖ్యానిస్తున్నారు.
