Begin typing your search above and press return to search.

మహిళలకు దసరా,దీపావళి కానుక.. 9క్యారెట్ గోల్డ్ లభ్యం.. వెరీ చీప్ గురూ!

అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు సమయంలో బంగారం అమ్మకాలు చాలా జోరుగా ఉంటాయి. పైగా త్వరలో దసరా, దీపావళి కూడా రాబోతున్నాయి.

By:  Madhu Reddy   |   25 Aug 2025 4:00 AM IST
మహిళలకు దసరా,దీపావళి కానుక.. 9క్యారెట్ గోల్డ్ లభ్యం.. వెరీ చీప్ గురూ!
X

దసరా, దీపావళి రాకముందే ఇప్పుడు మహిళలకు చక్కని శుభవార్త అని చెప్పవచ్చు. సాధారణంగా బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రీతి.. కానీ ప్రస్తుతం ఉన్న ధరల కారణంగా ఆ ఇష్టాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తోంది. ఆకాశాన్ని తాకుతున్న బంగారు ధరలను చూసి నచ్చిన నగలను ధరించలేక మగువలు పడే కష్టాలు మామూలు కాదు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఇప్పుడు 14 క్యారెట్స్ బంగారం కూడా చూస్తున్నాము. ఈ 9 క్యారెట్స్ గోల్డ్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.. అక్షరాల 9 క్యారెట్స్ గోల్డ్. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర కూడా చాలా తక్కువే. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా.. నచ్చిన హారం తయారీ చేయించుకోవచ్చు. మరి ఏంటీ 9 క్యారెట్స్ గోల్డ్ కథ ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు సమయంలో బంగారం అమ్మకాలు చాలా జోరుగా ఉంటాయి. పైగా త్వరలో దసరా, దీపావళి కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక బంగారు వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. పైగా శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి అయిపోయింది. అటు బంగారంపై పెట్టుబడికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటుండడంతో ఆభరణాలు కొనడం మరింత కష్టంగా మారిపోయింది. నిజానికి గత జూన్ లో భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం అమ్మకాలు.. దాదాపు 60 శాతం తగ్గాయి. దీన్ని బట్టి చూస్తే బంగారం కొనడానికి కొనుగోలుదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఈ బంగారానికి హాల్ మార్కింగ్ ను కూడా ఆమోదించింది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వ్యవస్థ కింద అధికారికంగా గుర్తించింది కూడా. వాస్తవానికి ఈ హాల్ మార్కింగ్ అనేది స్వచ్ఛతకు గుర్తు. హాల్ మార్క్ ఉందంటే అది స్వచ్ఛమైన బంగారంగా గుర్తించవచ్చు. ఇప్పటివరకు బిఐఎస్ 14K, 18K , 20K, 22K, 23K, 24K బంగారం వంటి స్వచ్ఛతను గుర్తించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి 9K కూడా వచ్చి చేరింది. ముఖ్యంగా ఈ తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాలను ప్రభుత్వ హామీతో విక్రయించవచ్చు.

ఇక ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం ఎంత స్వచ్ఛమైనది అనే విషయానికి వస్తే.. ఇందులో 37.5% బంగారం మాత్రమే ఉంటుంది. మిగిలిన 62.5% వెండి, రాగి, జింక్ వంటి ఇతర లోహాల మిశ్రమంతో లభిస్తుంది. పైగా ఖరీదు కూడా చాలా తక్కువ.. 24K బంగారం ప్రస్తుతం ఉన్న ధరలకు గ్రాముకు 10వేలు ఖర్చవుతుంది. అదే 9K బంగారం కేవలం రూ.3,700కే లభిస్తుంది. సులభంగా వంగదు.. గీతలు కూడా పడవు.. ఉంగరాలు.. రోజువారీ ఆభరణాలకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం కొనాలనే ఆసక్తి ఉన్న చాలా మంది డైలీ వారి ఉపయోగాలకు ఇలాంటి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు .