Begin typing your search above and press return to search.

హానీట్రాప్ లో 81 ఏళ్ల వృద్ధుడు.. ఏకంగా లక్షలు స్వాహా!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సప్ ద్వారా పరిచయం చేసుకుందట. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది.

By:  Madhu Reddy   |   22 Aug 2025 11:27 AM IST
హానీట్రాప్ లో 81 ఏళ్ల వృద్ధుడు.. ఏకంగా లక్షలు స్వాహా!
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న ఆశలు చూపించి లక్షల్లో స్వాహా చేస్తూ వారికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలి అని అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆఖరికి పూర్తిస్థాయిలో నష్టాన్ని చవిచూస్తున్నారు. అంతేకాదు ఈ సైబర్ నేరగాళ్ల మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా యువతను టార్గెట్ గా చేసుకొని చేస్తున్న హనీట్రాప్ లో ఏకంగా 81 సంవత్సరాల వృద్ధుడు ఇరుక్కోవడం సంచలనంగా మారింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ రక రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులోని అమీర్ పేటలో నివాసం ఉంటున్న 81 సంవత్సరాల వృద్ధుడు హనీట్రాప్ కేసులో ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఈయనను మోసం చేసి రూ.7.11 లక్షలు కాజేసింది ఒక యువతి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సప్ ద్వారా పరిచయం చేసుకుందట. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. అతడికి దగ్గరయ్యి.. టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరూ దగ్గర అయినట్లు వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో రికార్డును ఆధారంగా చేసుకొని మరొకరి సహాయంతో ఆ మహిళ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందట.ఆ వీడియోని అడ్డం పెట్టుకొని తన భర్తకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని.. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను లీక్ చేస్తానని బెదిరించిందట. నిందితురాలు బ్లాక్మెయిల్ తో భయపడిన ఆ వృద్ధుడు పలు దఫాలుగా ఆ మహిళకు రూ.7.11 లక్షలు ఇచ్చారట. పదేపదే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన ఆ వృద్ధుడు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించగా.. చివరికి తాను మోసపోయానని గ్రహించి.. కుటుంబ సభ్యుల సలహా మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ కేస్ కాస్త వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ టాపిక్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే బ్లాక్ మెయిల్ చేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ముఠా గతంలో ఇటువంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారట. ముఖ్యంగా ప్రజలను, వృద్ధులను అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారుపోలీసులు.. అంతేకాదు ఇలాంటివి జరిగినట్లు తెలిసినా..అనుమానం వచ్చిన వెంటనే సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా కోరుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.