రూ.46 లక్షల ట్రిప్.. తీరా చూస్తే ఐలాండ్ లో వదిలేసి వచ్చింది!
విదేశాల్లో డబ్బులున్నవారు ఎక్కువగా క్రూయిజ్ షిప్ లలో ఇతర ద్వీపాలకు ప్రయాణిస్తూ, పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తుండటం అత్యంత సహజమైన విషయం.
By: Raja Ch | 31 Oct 2025 9:34 AM ISTవిదేశాల్లో డబ్బులున్నవారు ఎక్కువగా క్రూయిజ్ షిప్ లలో ఇతర ద్వీపాలకు ప్రయాణిస్తూ, పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తుండటం అత్యంత సహజమైన విషయం. అలా వెళ్లిన వారిలో ఒకరిని పొరపాటున ఆ ఐలాండ్ లో వదిలేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఐలాండ్ లో వదిలివేయబడిన ఆ మహిళ వయసు 80 ఏళ్లు!
అవును... గ్రేట్ బారియర్ రీఫ్ లోని ఉష్ణమండల స్వర్గధామమైన లిజార్డ్ ద్వీపంలో 80 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ మరణించి కనిపించింది. ఆమె ప్రమాదవశాత్తూ ఒక క్రూయిజ్ షిప్ వదిలివేయడంతో అక్కడ చిక్కుకుంది! ఈ సంఘటనను ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (ఏ.ఎం.ఎస్.ఏ) దర్యాప్తు చేస్తోంది. బోర్డింగ్ సమయంలో ఆమెను ఎందుకు లెక్కించలేదనేది ఇప్పుడు కీలకంగా మారింది.
అసలేం జరిగింది..?:
న్యూసౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన సుజానే రీస్, క్రూయిజ్ షిప్ లో ఆస్ట్రేలియా వ్యాప్తంగా 60 రోజులపాటు సాగే టూర్ ప్లాన్ ను ఎంచుకున్నారు. దీనికోసం 80,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ (సుమారు రూ.46 లక్షల పైనే) చెల్లించారు. ఈ క్రమంలో.. గత వారం ఈ షిప్ కైర్న్స్ నుంచి బయలుదేరింది. ఈ టూర్ లో దీవులలో డేట్రిప్, హైకింగ్, స్నోర్కెలింగ్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఈ క్రమంలో కుక్స్ లుక్ అనే శిఖరం ఎక్కే ట్రెక్కింగ్ టీమ్ లో సుజానే చేరారు. అయితే.. ఆమె సగంలోనే అలసిపోయినట్లు తెలిసింది. ఈ సందర్భంగా స్పందించిన ఆమె కుమర్తె కేథరీన్... బాగా ఎండగా ఉండటం వల్ల మా అమ్మ అలసిపోయి అనారోగ్యం పాలైనట్లు మాకు పోలీసులు చెప్పారు.. ఎలాంటి తోడు ఇవ్వకుండా తిరిగి క్రూయిజ్ షిప్ దగ్గరకు వెళ్లమని ఆమెను పంపించేశారు.. తర్వాత ఆమె వచ్చారా లేదా అని చూసుకోకుండానే క్రూయిజ్ బయలుదేరిందని తెలిపారు.
ఈ క్రమంలో... ఆ రోజు సూర్యాస్తమయం సమయంలో ద్వీపం నుంచి ఓడ బయలుదేరింది. కానీ అందులో ఆ మహిళ కనిపించలేదనే విషయం కొన్ని గంటల తర్వాత తెలిసింది. దీంతో తిరిగి ఆమె కోసం క్రూయిజ్ ద్వీపానికి వచ్చింది. ఈ క్రమంలో.. ఆమెను వెతికేందుకు ఓ పెద్ద సెర్చ్ ఆపరేషన్ ను చేపట్టిన అధికారుల కంటే ముందే చేరుకున్న హెలీకాప్టర్ సిబ్బందికి ఆమె మృతదేహం కనిపించింది.
ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ (ఏ.ఎం.ఎస్.ఏ) చెప్పింది. డార్విన్ కు నౌక చేరుకున్న తర్వాత.. నౌకలోని సిబ్బందిని విచారిస్తామని తెలిపింది.
