లేటు వయసులో పెళ్లి.. 75 ఏళ్ల వయసులో ముసలితనంలో విడాకులు..
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా లో చోటుచేసుకున్న రెండు విడాకుల ఘటనలు సామాజికంగా విశేష చర్చకు దారి తీస్తున్నాయి.
By: A.N.Kumar | 31 March 2026 8:00 AM ISTహిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా లో చోటుచేసుకున్న రెండు విడాకుల ఘటనలు సామాజికంగా విశేష చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా వృద్ధాప్యంలో దాంపత్య జీవితాలు స్థిరంగా ఉంటాయని భావించే సమయంలో 75 ఏళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు తమ భర్తలకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కేసుల్లోనూ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే భార్యల కంటే భర్తల వయస్సు గణనీయంగా తక్కువగా ఉండటం. ఒక ఘటనలో భర్త వయస్సు 59 సంవత్సరాలు కాగా.. మరొక ఘటనలో 39 సంవత్సరాలుగా నమోదు కావడం గమనార్హం.
మొదటి కేసులో ఈ జంట 1990 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. మొదట్లో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితం, కాలక్రమేణా విభేదాలతో నిండిపోయింది. 2010 నాటికి ఇద్దరూ వేరువేరుగా జీవించడం ప్రారంభించారు. దాదాపు 15 సంవత్సరాల పాటు దూరంగా ఉన్న ఈ జంట చివరకు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తుల ద్వారా సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇక రెండో కేసులో 2008లో వివాహం జరిగిన ఈ జంట మధ్య 2021లో విభేదాలు మొదలయ్యాయి. వయస్సు తేడా ఎక్కువగా ఉండటం, జీవనశైలిలో భిన్నతలు, అభిప్రాయ భేదాలు వంటి కారణాలు వారి సంబంధాన్ని ప్రభావితం చేశాయని భావిస్తున్నారు. పరిస్థితులు తీవ్రతరం కావడంతో వారు కూడా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. చివరకు కోర్టులో పరస్పర సమ్మతితో విడాకులు మంజూరయ్యాయి.
ఈ రెండు ఘటనలు వయస్సు, సామాజిక ప్రమాణాలు, దాంపత్య బంధాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. వృద్ధాప్యంలో కూడా వ్యక్తిగత సంతృప్తి, మనశ్శాంతి ముఖ్యమని ఈ సంఘటనలు సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు “జీవితాంతం కలిసి ఉండాలి” అనే భావన బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు వ్యక్తిగత ఆనందం, స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరుగుతోంది.
మొత్తానికి ఈ ఘటనలు సమాజంలో మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వయస్సు ఎంతైనా, పరస్పర అవగాహన, గౌరవం లేకపోతే దాంపత్య జీవితం కొనసాగించడం కష్టమేనని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు సమాజంలో కొత్త చర్చలకు దారితీయడం ఖాయం.
