75 ఏళ్ల వయసులో పెద్దాయన సాహసం.. వావ్ అనాల్సిందే
వయసు కేవలం ఒక నెంబరు మాత్రమే. అంకెల్లో చూసినప్పుడు పెద్దగా కనిపించొచ్చు. కానీ.. మానసికంగా కుర్రాడిగా వ్యవహరించేటోళ్లు కొందరు ఉంటారు.
By: Garuda Media | 12 March 2026 10:33 AM ISTవయసు కేవలం ఒక నెంబరు మాత్రమే. అంకెల్లో చూసినప్పుడు పెద్దగా కనిపించొచ్చు. కానీ.. మానసికంగా కుర్రాడిగా వ్యవహరించేటోళ్లు కొందరు ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే పెద్దాయన రెండోకోవకు చెందిన వారు. పెద్ద వయసు.. ఇంట్లో ఒక మూలన కూర్చోవాలని ఆయన అస్సలు అనుకోలేదు. ఇంత వయసులో ఆయన చేస్తున్న సాహస యాత్ర గురించి తెలిస్తే మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకూ ఆయన ఎవరు? ఏం చేస్తున్నారు? అన్న విషయంలోకి వెళితే.. కొత్త విషయాల్ని తెలుసుకోవాలన్న తపన ఉండాలే కానీ.. వారిని వయసు ఎంతమాత్రం ఆపదన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుంది.
మహారాష్ట్రలోని ఫూణె నగరానికి దగ్గర్లోని చించవడ్ పట్టణానికి చెందిన సుబాష్ గుగ్లేకు అక్షరాల 75 ఏళ్లు. అయినప్పటికీ ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆయన దేశం మొత్తాన్ని నానో కారులో చుట్టేయాలని డిసైడ్ అయ్యారు. అంతే.. తన సాహస యాత్రను షురూ చేశారు. రోజుకు ఎనిమిది గంటలు కారు నడుపుతూ తన పర్యటను మొదలుపెట్టారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్ని చుట్టేసిన ఆయన.. సిక్కిం.. పంజాబ్.. రాజస్థాన్.. గుజరాత్ రాష్ట్రాల్ని కంప్లీట్ చేశారు. ఈ మొత్తం రాష్ట్రాల్ని తన నానో కారుతోనే చుట్టేశారు.
ఒకసారి ఆయన తన జర్నీని షురూ చేస్తూ.. పది.. పదిహేను రోజుల పాటు ప్రయాణిస్తూ ఉంటారు. తన అవసరాలకు సంబంధించిన సామాన్లతో పాటు.. ఆహారాన్ని వెంట తీసుకెళుతుంటారు. సాధారణ బసతో విశ్రాంతి తీసుకుంటారు. తన చిన్నతనంలో తన తండ్రి గుర్రంపై కూర్చోబెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవారని.. ఆ అనుభవాలే తనకు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించే ఆసక్తిని కలిగించినట్లు చెబుతారు.
మనసు కాస్త బరువుగా ఉన్నా.. ఒంట్లో కాస్తంత నలతగా ఉన్నా మందులు వేసుకునే కన్నా.. ప్రయాణాలకే తాను మొగ్గుచూపుతానని చెబుతున్నారు. మన దేశం ఎంతో వైవిధ్యభరితమైనదని.. ఎంతో అందమైనదని చెప్పే ఆయన.. తాను ప్రయాణాల్ని ఎంజాయ్ చేస్తుంటానని చెబుతారు. వివిధ రాష్ట్రాల ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని తన ప్రయాణాలు ఇస్తుంటాయని చెబుతారు. వయసు పేరుతో తమను తాము కట్టడి చేసుకునే ఎందరికో సుభాష్ సరికొత్త స్ఫూర్తి అని మాత్రం చెప్పక తప్పదు.తన భర్తను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉంటుందని సుభాష్ సతీమణి పేర్కొనటం గమనార్హం. పెద్ద వయసులో కుర్రాడిలా ఈ ప్రయాణాలేంటి? అంటూ హైరానా పడకుండా.. భర్త ఇష్టాల్ని గౌరవిస్తూ.. ప్రోత్సహించే తీరు చూడముచ్చటగా ఉందని చెప్పాలి.
