షాకింగ్ : అమెరికాలో 6వేల మంది విద్యార్థుల వీసాల రద్దు
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
By: A.N.Kumar | 19 Aug 2025 4:32 PM ISTఅమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ దాదాపు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ చర్య అంతర్జాతీయ విద్యార్థులతో పాటు, అమెరికాలోని విద్యా సంస్థలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
- వీసాల రద్దుకు కారణాలు
వీసాల రద్దుకు ప్రధాన కారణాలు చట్ట ఉల్లంఘనలేనని బీబీసీ నివేదిక వెల్లడించింది. క్రిమినల్ నేరాలైన మత్తులో వాహనాల్లో ప్రయాణించడం, దాడులు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడిన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దు చేయబడిన వారిలో సుమారు 4,000 మంది ఇటువంటి నేరాల్లో పాలుపంచుకున్నారు. అంతేకాకుండా అమెరికా చట్టంలోని INA 3B సెక్షన్ ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న 300 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
- ట్రంప్ పాలసీల ప్రభావం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా రంగంలో తీసుకొచ్చిన కొత్త పాలసీలు అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో యాంటీసెమిటిజం వ్యతిరేక బిల్లు ప్రకారం యూదులపై వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనేవారి వీసాలను రద్దు చేయడం లేదా దేశ బహిష్కరణ వంటి చర్యలు తీసుకుంటారు. జూన్‌లో కొత్త ఇంటర్వ్యూల నిలిపివేశారు. ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇంటర్వ్యూ షెడ్యూల్స్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కఠినమైన సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా.. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. వారి పోస్ట్‌లు, కామెంట్‌లు, లైక్‌లను కూడా అమెరికా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
- విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాల మధ్య న్యాయపోరాటం
అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనా అనుకూల ఆందోళనలలో పాల్గొనడం వల్ల చాలామంది అరెస్టు అయ్యారు. హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా విదేశీ విద్యార్థులను నియమించుకోవడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయాలు, ట్రంప్ ప్రభుత్వం మధ్య న్యాయపోరాటం కూడా మొదలైంది.
- ఆర్థిక కోణం
అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందిస్తున్నారు. గత సంవత్సరం గణాంకాల ప్రకారం.. అమెరికాలో 10 లక్షలకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి ద్వారా అమెరికాకు $43.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. వీరు దేశంలోని మొత్తం విద్యార్థులలో 6% ఉన్నారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వెలుగులోకి వచ్చిన ఈ పరిణామాలు, వీసా రద్దులు, కఠిన నిబంధనలు అంతర్జాతీయ విద్యార్థులలో ముఖ్యంగా భారతీయ విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి ఈ మార్పులు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది.
