Begin typing your search above and press return to search.

బాంబు బ్లాస్టింగ్.... అదే ముహూర్తం ?

చీకటి పడితే చాలా మూసుకుంటాయి. చీకటిలోనే అఘాయిత్యాలకు తెర తీయవచ్చు. అంతే కాదు సాయంత్రం ఆరు నుంచి ఏడు సమయం జన సమ్మర్ధం ఉండే సమయం.

By:  Satya P   |   12 Nov 2025 11:00 PM IST
బాంబు బ్లాస్టింగ్.... అదే ముహూర్తం ?
X

ఏంటో శుభాలే కాదు దుర్మార్గాలకు కూడా ముహూర్తాలేనట. మరి అది యాంటీ సెంటిమెంట్ గా భావిస్తారో లేక అచ్చి వస్తుందని అనుసరిస్తారో లేక చీకటి తోడుగా చేసుకుని లోకానికి భయం పుట్టించాలని ఎంచుకుంటారో తెలియదు కానీ భారత దేశంలో జరిగిన బాంబు బ్లాస్టింగ్స్ అన్నీ ఒకే ముహూర్తంలో సాగడమే విశేషం. చిత్రమేంటి అంటే అన్నీ సాయం సమయం దాటిన తర్వాత రాత్రి వేళలోనే జరిగాయి. అంటే దీని భావమేంటో ఉగ్ర వాదులకే తెలియాలి మరి.

నిశాచర ముష్కరులు :

నిశిలో సంచరించే వారు అంతా ముష్కరులు కాదు కానీ బాంబు దాడులు నిశిలో చేసి లోకాన్ని మసి చేయాలనుకున్న వారు అంతా ముష్కరుల కిందనే లెక్క. అలాంటి వారే దేశంలో రాత్రి వేళలలో ఈ తరహా ఘాతుకాలకు పాల్పడ్డారు. తాజాగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన బాంబు బ్లాస్టింగ్ చూస్తే కనుక ఏకంగా 12 మంది దాకా మరణించారు. ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ ముహూర్తం చూస్తే కనుక సాయం సమయమే కావడం విశేషం. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సూత్రధారిగా చెబుతున్న వారు డాక్టర్ ఉమర్ మహ్మద్. ఆయన భయంతో ఆందోళన చెంది మరీ ఈ విధంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు అని విచారణ బృందం అనుమానిస్తోంది.

ఆ ఇద్దరూ అరెస్టు తో :

ఇక ఫరీదాబాద్ లో ఉగ్ర కుట్రని చేదించారు భద్రతా సంస్థలు. అదే సమయంలో ఉమర్ అమ్హద్ సహచరులు అయిన డాక్టర్ ముజామిల్ షకీల్, అలాగే డాక్టర్ అదీల్ అహ్మద్ రధర్ అరెస్టు కావడంతో నే ఉమర్ ఈ విధంగా ఢిల్లీ ఎర్ర కోట వద్ద ఈ భారీ పేలుడుకు పాల్పడ్డారు అని అంటున్నారు. ఆయన తనతో పాటు ఉన్న భారీ పేలుడు పదార్థాలతో చిక్కితే సీన్ సితారే అని భావించే ఈ విధంగా పేలుడుకు పాల్పడ్డాడు అని అంటున్నారు.

ఒకే టైం లోనే :

సరే ఉమర్ చేసిన ఈ ఘాతుకం వెనక ఎవరు ఉన్నారు అన్నది దర్యాప్తులో తేలుతుంది. కానీ ఎర్రకోట నుంచి వెనక్కి వెళ్ళి చూస్తే బాంబు బ్లాస్టింగ్ అన్నీ ఒకే సమయంలో చోటు చేసుకోవడం అని అంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇదే జరిగింది అని అంటున్నారు. ఈ పేలుళ్ళు ఘటనలు అన్నీ సాయంత్రం ఆరు నుంది రాత్రి ఏడు గంటల మధ్యనే చోటు చేసుకున్నాయని అంటున్నారు. లేటెస్ట్ బాంబు బ్లాస్ట్ లో నిందితుడు ఉమర్ అయితే ఎర్ర కోట వద్దకు మధ్యాహ్నమే వచ్చాడుట. కానీ ఎందుకో సాయంత్రం కావాలని పొద్దు పోవాలని వేచి చూసి మరీ ఈ ఘాతుకానికి దిగాడు అంటే ఈ పేలుళ్లకూ ఒక దుర్ముహూర్తం ఉందని అంటున్నారు.

రీజన్లు గట్టివే :

చీకటి పడితే చాలా మూసుకుంటాయి. చీకటిలోనే అఘాయిత్యాలకు తెర తీయవచ్చు. అంతే కాదు సాయంత్రం ఆరు నుంచి ఏడు సమయం జన సమ్మర్ధం ఉండే సమయం. అంతే కాదు ఎక్కువ మందిని టార్గెట్ చేయవచ్చు. ఇంటికి వెళ్ళే వారు ఎక్కువ మంది ఉంటారు. ఇక మార్కెట్లు కళకళలాడతాయి. మాల్స్ ఇతర కేంద్రాలు అన్నీ రద్దీగా ఉంటాయి. అందుకే ఎక్కువ మందిని చంపాలి అనుకున్న వారికి తాము తప్పించుకోవచ్చు ఏ సీసీ కెమెరా సరిగ్గా రికార్డు చేయలేదు అన్న ధీమాతోనే ఈ సమయాన్ని ఎంచుకుంటున్నారు అని అర్ధం అవుతోంది.

ఈ లిస్ట్ చూస్తే కనుక :

ఈ విధంగా భారత దేశంలో సాయంత్రం జరిగిన కీలకమైన బాంబు పేలుళ్ళ జాబితా చూస్తే మతి పోతుంది. 2005 అక్టోబర్ 29వ తేదీన ఢిల్లీలో సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్యలో బాంబు పేలుళ్ళు జరిగాయి. డెబ్బై మంది దాకా మరణించారు. అలాగే 2006 మార్చి ఏడున వారణాసిలో సాయంత్రం 6 గంటల 20 నిముషాలకు బాంబు పేలుళ్ళు జరిగితే 28 మంది మరణించారు. 2006 జూలై 11న ముంబైలో 6 గంటల 24 నిముషాల నుంచి ఏడు గంటల 50 నిముషాల మధ్యలో ఏడు సార్లు బాంబు పేలుళ్ళు జరిగాయి. ఏకంగా 209 మంది మరణించారు. 2007 ఆగస్ట్ 28న హైదరాబాద్ లో సాయంత్రం 7.45 కి అలాగే 7.50 కి రెండు సార్లు బాంబు పేలుళ్ళు పేలితే ఏకంగా 42 మంది మరణించారు.

ఇక 2008 మే 13న జైపూర్ లో సాయంత్రం 7.30 కి తొమ్మిది సార్లు బాంబు పేలుళ్ళు జరిగాయి ఈ ఘటనలో 63 మంది మరణించారు. 2008 జూలై 26న అహ్మదాబాద్ లో 21 సార్లు బాంబు పేలుళ్ళు జరిగాయి. సమయం చూస్తే సాయంత్రం 6.30 నుండి స్టార్ట్ అయింది. ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు.2008 సెప్టెంబర్ 13న - ఢిల్లీలో 5 సార్లు బాంబు పేలుళ్ళు జరిగితే అది కూడా సాయంత్రం 6.07 నుండి ముహూర్తంగా ఎంచుకున్నారు. మొత్తం 25 మంది చనిపోయారు. ఇక 2010 ఫిబ్రవరి 13న పూణెలో సాయంత్రం 7.15కి బాంబు పేలుళ్ళు జరిగాయి 17 మంది మరణించారు. అదే విధంగా 2010 డిసెంబర్ 7న వారణాసిలో బాంబు పేలుళ్లు సాయంత్రం 6.30 కి జరిగితే ఏకంగా 33 మంది మరణించారు. హైదరాబాద్ లో 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.58, అలాగే రాత్రి 7.-01 నిమిషాలకు రెండు సార్లు బాంబు పేలుళ్ళు జరిగితే 17 మంది మరణించారు. ఈ రికార్డు అంతా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యనే యమ దూతలు మాదిరిగా ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయని వందల మందిని పొట్టన పెట్టుకుంటున్నాయని అర్ధం అవుతోంది.