57 ఏళ్ల ఏజ్ గ్యాప్.. 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడ్డ 81 ఏళ్ల బామ్మ.. వైరల్ అవుతున్న లవ్ స్టోరీ
ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ ప్రస్తుతం నెట్టింట ఒక విచిత్రమైన, వింతైన ప్రేమాయణం వైరల్ అవుతోంది.
By: A.N.Kumar | 5 Aug 2026 10:58 AM ISTప్రేమకు కళ్లు లేవు.. వయసుతో అస్సలు సంబంధం లేదు అని ఎవరో మహానుభావుడు ఊరికే అనలేదు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ ప్రస్తుతం నెట్టింట ఒక విచిత్రమైన, వింతైన ప్రేమాయణం వైరల్ అవుతోంది. అదేనండీ.. ఏకంగా 57 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో నడుస్తున్న ఒక ఘాటు లవ్ స్టోరీ.. ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల బామ్మ.. ఆఫ్రికాలోని సెనెగల్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడిపోయారు. మన దేశంలో పక్కపక్క ఇళ్ల మధ్య ప్రేమలకే బోలెడు పంచాయితీలు, రచ్చలు నడుస్తుంటే.. ఈ జంట మాత్రం ఖండాలు దాటి.. ఏజ్ డిఫరెన్స్ లెక్కలను తుడిచేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ఇంతకీ ఈ వింత ప్రేమ కథ ఎలా మొదలైందంటే.. రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా పుణ్యమా అని వీరికి ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. మొదట్లో సాధారణంగా హాయ్, హలోలతో మొదలైన పలకరింపులు.. ఆ తర్వాత గంటల తరబడి వీడియో కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లుగా మారిపోయాయి. క్రమంగా అది కాస్తా తీవ్రమైన స్నేహంగా.. చివరికి నువ్వు లేక నేను లేను అనే రేంజ్ ప్రేమగా రూపాంతరం చెందింది. స్క్రీన్ల మీద చూసుకుని మురిసిపోవడం చాలనుకున్న మన 81 ఏళ్ల బామ్మ గారు.. ఆన్‌లైన్ లవ్‌ని ఆఫ్ లైన్‌కి మార్చాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకంగా విమానమెక్కి ప్రియుడి కోసం సెనెగల్ దేశంలో ల్యాండ్ అయిపోయారు.
ఎయిర్‌పోర్టులో 24 ఏళ్ల ప్రియుడు ఎదురొచ్చి బామ్మను ఆప్యాయంగా హత్తుకోవడం.. ముద్దుల వర్షం కురిపించడం చూసి పక్కనున్న ప్రయాణికుల మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఈ సీన్లన్నీ వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో ప్రస్తుతం మీమ్ రాయుళ్లకు కావలసినంత మేత దొరికింది. ఈ ప్రేమజంట ముచ్చట చూసి సోషల్ మీడియా వేదికగా జనాలు రెండుగా విడిపోయారు. ఒక వర్గం వారు వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. మనసులు కలిస్తే చాలు కాబట్టి వారిని హ్యాపీగా ఉండనివ్వండని హార్ట్ సింబల్స్ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సందేహ ప్రాణులు మాత్రం ఇదంతా పక్కా ప్లాన్ అని.. యూరప్ వీసా కోసమో లేదా బామ్మ గారి పెన్షన్, ఆస్తుల కోసమో ఈ కుర్రాడు పెద్ద స్కెచ్ వేసి ఉంటాడని తమదైన శైలిలో విశ్లేషణలు మొదలుపెట్టారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ జంట వచ్చే సెప్టెంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో ఇది కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ స్టంటా అనేది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా 24 ఏళ్ల వయసులో లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలా అని సగటు కుర్రాళ్లు కష్టపడుతుంటే.. ఈ కుర్రాడు ఎంచుకున్న షార్ట్‌కట్ రూట్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు..
