Begin typing your search above and press return to search.

56 అంగుళాల ఛాతీ.. : ఏంటీ ట్రోలింగ్‌?

2014-19 మ‌ధ్య తొలిసారి ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన స‌మ‌యంలో మోడీ... త‌న‌ను తాను 56 అంగుళాల ఛాతీ అని ప్ర‌చారం చేసుకున్నారు.

By:  Garuda Media   |   27 July 2026 3:55 PM IST
56 అంగుళాల ఛాతీ.. : ఏంటీ ట్రోలింగ్‌?
X

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున '56 అంగుళా ఛాతీ' అంటూ ట్రోలింగ్ జ‌రుగుతోంది. దీనిని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర విప‌క్షాలు.. దీనికి మ‌రింత మ‌సాలా జోడించి కామెంట్లు చేస్తున్నాయి. ఇది పూర్తిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సంబంధించి జ‌రుగుతున్న విమ‌ర్శ‌లుగా బీజేపీ కూడా చెబుతోంది. అయితే.. ఎక్క‌డా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోగా.. దీనిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ ట్రోలింగ్ పెను దుమారం రేపుతోంది.

అస‌లేంటిది?

2014-19 మ‌ధ్య తొలిసారి ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన స‌మ‌యంలో మోడీ... త‌న‌ను తాను 56 అంగుళాల ఛాతీ అని ప్ర‌చారం చేసుకున్నారు. ఈ దేశానికి 56 అంగుళాల ఛాతీ ఉన్న నాయ‌కుడు ల‌భించాడ‌ని బీజేపీ నాయ‌కులు కూడా విస్తృతం ప్ర‌చారం చేశారు. త‌ద్వారా.. ఆయ‌న ధైర్యవంతుడ‌ని, ఆయ‌న‌కు ఎవరూ సాటి లేర‌ని.. ఆయ‌న వంటి నాయ‌కుడు దేశంలోనే లేర‌ని ఇలా.. అనేక గొప్ప‌ల‌ను ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఈ ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే.. ఆ త‌ర్వాత చైనాతో గాల్వాన్‌లో జ‌రిగిన పోరాటం.. ఈ క్ర‌మంలో మ‌న దేశానికి చెందిన సైనికులు మృతి చెంద‌డంతో ఈ వ్య‌వ‌హారం తెర‌మ‌రుగైంది.

ఇప్పుడు..?

ఇప్పుడు మ‌రోసారి ప్ర‌ధాని 56 అంగుళాల ఛాతీ వ్య‌వ‌హారంపై ట్రోలింగ్ జ‌రుగుతోంది. నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ విష‌యంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌ను తొలుత అణిచి వేయాల‌ని ప్ర‌య‌త్నించార‌న్న‌ది విద్యార్థులు చేసిన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ పోలీసులు.. లాఠీ చేయ‌డం, ప్ర‌త్యేక జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టానికి ప‌దును పెట్ట‌డం.. మ‌హారాష్ట్ర స‌హా.. ప‌శ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. ఈ వ్య‌వ‌హారాల నేప‌థ్యంలో విద్యార్థుల ఆందోళ‌న స‌మ‌సిపోతుంద‌ని భావించారు. కానీ,ఈ వ్యూహం తిర‌గ‌బ‌డిందన్న‌ది ప్ర‌తిప‌క్షాలు చెబుతున్న మాట‌.

కానీ, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నేతృత్వంలో దేశ‌వ్యాప్తంగా ఏక‌మైన విద్యార్థులు.. కేంద్రం దిగి వ‌చ్చే వ‌ర‌కు త‌మ‌ పోరాటాన్ని కొన‌ సాగించారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు కూడా ఉడుం ప‌ట్టు బిగించారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని వ‌రుస‌గా అర్ధ‌రాత్రి సెల్ఫీ వీడియోలు విడుద‌ల చేయ‌డం.. విద్యార్థుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం.. తొలుత కేంద్ర మంత్రి రాజీనామా ఉండబోద‌ని ఓ వ‌ర్గం మీడియా ద్వారా లీకులు అందించ‌డం తెలిసిందే. కానీ, చివ‌ర‌కు కేంద్ర మంత్రి రాజీనామా చేయ‌డంతోపాటు .. ప్ర‌భుత్వం కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దీనిని ప్ర‌స్తావిస్తూ.. 56 అంగుళాల ఛాతీ బోర విరుచుకోలేద‌ని.. సాగిల‌ప‌డింద‌ని పెద్ద ఎత్తున ట్రోల్స్ వ‌స్తున్నాయి.