భార్యల చేతిలో 554 మంది భర్తలు ఖతం.. కలియుగంలో ఇదో దారుణం
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. రెండు మనసులు.. రెండు కుటుంబాలను కలిపే ఒక పవిత్ర బంధం అనుకున్నారు.
By: A.N.Kumar | 20 July 2026 12:58 AM ISTఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. రెండు మనసులు.. రెండు కుటుంబాలను కలిపే ఒక పవిత్ర బంధం అనుకున్నారు. కానీ నేడు అదే బంధం కొందరి పాలిట మృత్యుపాశంగా మారుతోంది. నమ్మిన భార్యే ప్రాణాలు తీసే యముడిగా మారుతుంటే కట్టుకున్న భర్తలే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కలియుగంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంచలన నివేదికే నిదర్శనం. గత ఆరు నెలల్లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ నివేదిక.. దాంపత్య జీవితాల్లో దాగి ఉన్న భయానక నిజాన్ని మన ముందుంచింది.
ఆరు నెలల్లో ఆరిపోయిన 554 దీపాలు
గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. 2026 జనవరి నుంచి జులై 14 వరకు అంటే కేవలం ఆరు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా మొత్తం 554 మంది భర్తలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. సమాజంలో పురుషులపై జరుగుతున్న హింసకు, వారు అనుభవిస్తున్న మానసిక నరకానికి ఈ సంఖ్య అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో సైతం ఈ నివేదిక ఇప్పుడు ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రేమించాల్సిన హృదయాల్లో ఇంతటి పగ, ద్వేషాలు ఎలా నిండుతున్నాయనేది మింగుడుపడని ప్రశ్నగా మారింది.
నివేదికలోని గుండె కోసే నిజాలు
తమను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటానని ప్రమాణం చేసిన 322 మంది భర్తలు.. భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఇక వైవాహిక జీవితంలో విభేదాలు, నిరంతర గృహహింస, భరించలేని మానసిక ఒత్తిడి కారణంగా తట్టుకోలేక 232 మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడి బలవన్మరణం చెందారు.
అధికారిక డేటా కాకపోయినా.. ఆలోచింపజేసే సత్యం
అయితే ఈ విస్తుపోయే నిజాలను వెల్లడించిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ ఒక కీలక వివరణ ఇచ్చింది. ఇవి ప్రభుత్వ అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు కావు. దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో, పత్రికల్లో ప్రచురితమైన వార్తలను సేకరించి.. విశ్లేషించి రూపొందించిన నివేదిక ఇది. అయినప్పటికీ, మీడియాలో వచ్చిన ఈ వార్తలు సమాజంలో జరుగుతున్న ఒక చేదు నిజానికి ప్రతిరూపాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంఖ్య ఏదైనా ఇన్ని వందల కుటుంబాలు రోడ్డున పడటం నిజంగా ఒక సామాజిక విపత్తే.
మారుతున్న కుటుంబ వ్యవస్థ.. మంటగలుస్తున్న బంధాలు
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో సమస్యలు వస్తే సర్దుబాటు చేసే పెద్దలు ఉండేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో అహాలు, పరస్పర నమ్మకరాహిత్యం, క్షణికావేశాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కనీస సంభాషణ కరువవుతోంది. చిన్న చిన్న గొడవలు కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి చివరకు ఒకరి ప్రాణం తీసేంత లేదా ఒకరు ప్రాణం తీసుకునేంత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మహిళల భద్రత, రక్షణ కోసం చట్టాలు ఎంత అవసరమో, పురుషుల మానసిక ఆరోగ్యం, వారి సంక్షేమం కూడా అంతే ముఖ్యమని సామాజిక విశ్లేషకులు గళం విప్పుతున్నారు.
పరిష్కారం ఎక్కడ ఉంది?
దాంపత్య జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించుకోవాలి. ఈ నివేదిక మనకు ఇచ్చే హెచ్చరిక ఒక్కటే గొడవలు మితిమీరుతున్నప్పుడు ఇగోలకు పోకుండా ప్రొఫెషనల్ కౌన్సెలర్లను ఆశ్రయించడం ఉత్తమం. పురుషులు తమ మనసులోని బాధను, ఒత్తిడిని దాచుకోకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయి. సమస్య ఏదైనా శాంతియుతంగా మాట్లాడుకుని, అవసరమైతే చట్టబద్ధంగా విడిపోవాలే తప్ప ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లకూడదు.
ఈ నివేదికను కేవలం అంకెల రూపంలో చూడకుండా మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి.. బంధాల విలువను తిరిగి తెలుసుకోవడానికి ఒక హెచ్చరికగా భావించాల్సిన సమయం ఆసన్నమైంది.
