Begin typing your search above and press return to search.

రూ.500 నోటు కంటే రూ.200 నోటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. కరెన్సీ నోట్లను ముద్రించేందుకు అయ్యే ఖర్చు లెక్కలు ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తుంటాయి.

By:  Garuda Media   |   15 Sept 2025 3:00 PM IST
రూ.500 నోటు కంటే రూ.200 నోటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ
X

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. కరెన్సీ నోట్లను ముద్రించేందుకు అయ్యే ఖర్చు లెక్కలు ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తుంటాయి. పెద్ద నోట్ల ముద్రణతో పోలిస్తే.. చిన్ననోట్ల ముద్రణకు ఎక్కువ ఖర్చు అవుతుంది. గడిచిన కొంతకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూ.500 నోటు ముద్రణ కంటే కూడా రూ.200 కరెన్సీ నోటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువైందన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

పెద్ద నోట్లను రద్దు చేసి.. రూ.2వేల నోటుతో పాటు రూ.500 నోటును.. ఆ తర్వాతి కాలంలో కొత్తగా రూ.200 నోటును చలామణీలోకి తీసుకురావటం తెలిసిందే. 2018-19లో తెర మీదకు వచ్చిన రూ.200 నోటుకు అప్పట్లు రూ.2.15 చొప్పున ముద్రణ ఖర్చు ఉండేది. అప్పట్లో రూ.500 నోట్ ను ప్రింట్ చేసేందుకు రూ.2.24 ఖర్చు అయ్యేది. చలామణీ నుంచి తొలగించిన రూ.2వేల నోటు ముద్రణకు రూ.3.54 ఖర్చు అయ్యేది. ఈ ఖర్చులు కాలంతో పాటు మారాయి.

తాజాగా కరెన్సీ నోట్ల ఖర్చుకు సంబంధించి భారత రిజర్వు బ్యాంకు వెల్లడించిన లెక్కల్ని చూసినప్పుడు.. గతానికి భిన్నంగా రూ.500 నోటు కంటే కూడా రూ.200నోటు ముద్రణ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టటం కనిపిస్తుంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. చలామణిలో ఉన్న పది రూపాయిల నోటును తయారు చేసేందుకు 96 పైసలు ఖర్చు కాగా.. రూ.20 నోటుకు 95పైసలు.. రూ.50 నోటుకు రూ.1.13.. వంద రూపాయిల నోటు తయారీకి రూ.1.77, రూ.200 కరెన్సీ నోటు తయారీకి రూ.2.37 ఖర్చు కాగా.. రూ.500 నోటు మద్రణ ఖర్చు రూ.2.29 మాత్రమే కావటం విశేషం.

విలువలో 200నోటుతో పోలిస్తే 500 నోటు డబుల్ కంటే ఎక్కువే అయినా.. ఖర్చు మాత్రం రూ.200 నోటు కంటే రూ.500 నోటు ప్రింటింగ్ ఖర్చు తక్కువగా ఉంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు.. రూ.200నోటుకు నకిలీ బెడద ఎక్కువగా ఉండటంతో.. అదనపు భద్రతా చర్యలు తీసుకోవటంతో పాటు.. ముద్రణ సందర్భంగా తీసుకునే చర్యలు రూ.200నోటు ప్రింటింగ్ కు ఎక్కువ ఖర్చు అయ్యేలా చేస్తుందనిచెబుతున్నారు.

గతంతో పోలిస్తే 2024-25లో కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు బాగా పెరిగినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. అదే సమయంలో రూపాయి నాణెన్ని తయారు చేయటానికి రూ.1.11 ఖర్చు అవుతుందని ఆర్ బీఐ చెబుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వు బ్యాంకు రూ.6372 కోట్లు ఖర్చు చేసినట్లుగా వెల్లడైంది. మొత్తం కరెన్సీ నోట్ల చెల్లుబాటులో రూ.500 నోట్లు 40శాతం కాగా.. ఈ మొత్తం కరెన్సీ విలువలో 80 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.