డిస్కౌంట్ పేరుతో నిజంగా డబ్బు ఆదా చేస్తున్నామా.. లేక ఖర్చు పెంచుకుంటున్నామా?
ఉదాహరణకు ₹2,000 విలువైన ఒక వస్తువు డిస్కౌంట్‌లో ₹1,000కి దొరికిందనుకుందాం. సాధారణంగా మనం ‘₹1,000 ఆదా చేశాం’ అని మురిసిపోతుంటాం.
By: A.N.Kumar | 24 Aug 2026 5:00 PM IST“50% ఆఫ్” అనే బోర్డు కనిపించగానే మీ మెదడులో ఆనందపు బెల్లు మోగుతోందా? "బాబోయ్.. సగం ధరే!" అని సంబరపడుతూ కార్ట్‌లోకి ఆ వస్తువును తోసేస్తున్నారా? అయితే ఆగండి. మీరు డబ్బులు ఆదా చేయడం లేదు.. మార్కెటింగ్ గాలానికి ఎర అయ్యి చిక్కుకుంటున్నారు. ‘ఉచితం’, ‘ఫ్లాష్ సేల్’ అనే రంగుల వలలో పడి మీ జేబుకు మీరే చిల్లు పొడుచుకుంటున్న ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం..
షాపింగ్ మాల్స్ నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల వరకు ఎక్కడ చూసినా ‘50% తగ్గింపు’, ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘పరిమిత కాల ఆఫర్’, ‘ఫ్లాష్ సేల్’ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు మనల్ని నిరంతరం ఆకట్టుకుంటూనే ఉంటాయి. డిస్కౌంట్ బోర్డు కనిపించగానే చాలామందికి వెంటనే కొనుగోలు చేయాలనే ఆలోచన కలగడం సహజం. తక్కువ ధరకు వస్తువు లభిస్తోందనే సంతోషంతో క్రెడిట్ కార్డులు.. ఆన్‌లైన్ పేమెంట్లు వాడేస్తుంటాం. అయితే ప్రతి డిస్కౌంట్ నిజంగా మనకు డబ్బు ఆదా చేస్తోందా? లేక మనకు తెలియకుండానే జేబుకు పెద్ద చిల్లు పెడుతోందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
- ఆదా అనుకోవడం మన భ్రమేనా?
ఉదాహరణకు ₹2,000 విలువైన ఒక వస్తువు డిస్కౌంట్‌లో ₹1,000కి దొరికిందనుకుందాం. సాధారణంగా మనం ‘₹1,000 ఆదా చేశాం’ అని మురిసిపోతుంటాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఆ వస్తువు మనకు నిజంగా అవసరమా? ఒకవేళ ఆ వస్తువుతో మనకు ఎలాంటి అవసరం లేకపోతే వాస్తవానికి మనం ₹1,000 ఆదా చేయలేదు.. అనవసరంగా ₹1,000 ఖర్చు చేశాం. అవసరమైన వస్తువును సాధారణం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆదా' అవుతుంది.
- 50% ఆఫ్ వెనుక సైకాలజీ
డిస్కౌంట్ శాతం పెద్దగా కనిపిస్తే మన మెదడు దాన్ని ఒక గొప్ప ‘అవకాశం’గా భావిస్తుంది. ‘ఈ ఆఫర్ ఇప్పుడే ఉంది.. తర్వాత ఉండదు’ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్ సందేశాలు కొనుగోలుదారుడిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. దానికి తోడు ఫ్లాష్ సేల్ కూడా వినియోగదారులు ఆలోచించే సమయం ఇవ్వకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.
అలాగే ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘కాంబో ఆఫర్లు’ కూడా మరొక చతురతతో కూడిన వ్యూహమే. మనకు ఒక వస్తువు మాత్రమే అవసరమైనప్పటికీ.. రెండోది ఉచితంగానో లేక తక్కువ ధరకో వస్తుందనే ఆశతో అదనంగా ఖర్చు చేస్తాం. చివరికి ‘ఉచితంగా వచ్చింది’ అనుకున్న వస్తువు కోసం కూడా మన జేబు నుంచే డబ్బులు వెళ్తాయి.
- ‘ నిజంగా అసలు ధరేనా?
‘₹5,000 ఎమ్మార్పీ ఇప్పుడు ₹2,499 మాత్రమే’ అనే ప్రకటన చూసినప్పుడు ₹2,501 ఆదా చేస్తున్నామనిపిస్తుంది. కానీ ఆ ₹5,000 అనేది నిజంగా మార్కెట్ సాధారణ ధరేనా అంటే చాలా సందర్భాల్లో కాదనే చెప్పాలి. డిస్కౌంట్‌ను భారీగా చూపించడానికి కొన్ని కంపెనీలు పోలిక ధరను ముందే పెంచి చూపిస్తుంటాయి. అందుకే డిస్కౌంట్ శాతాన్ని చూసి మోసపోకుండా మార్కెట్‌లో అదే వస్తువు ఇతర చోట్ల ఎంతకు లభిస్తుందో సరిపోల్చి చూడటం ముఖ్యం.
- చిన్న డిస్కౌంట్లు.. పెద్ద మొత్తంలో ఖర్చులు
₹300, ₹500, ₹700 అంటూ చిన్న చిన్న ఆఫర్లలో చేసే కొనుగోళ్లు ఒక్కోసారి మనకు పెద్దగా అనిపించవు. కానీ నెల చివరికి వాటన్నింటినీ కలిపి చూస్తే వేల రూపాయలు అనవసరంగా ఖర్చయి ఉంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ , ఈఎంఐ, 'ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి' సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ‘ఇప్పుడు కొని.. తర్వాత చెల్లించవచ్చు’ అనే భావనతో జనం పరిమితికి మించి ఖర్చు చేస్తున్నారు.
ఈ డిస్కౌంట్లు కేవలం వినియోగదారులను ఆకర్షించడానికే కాదు.. రిటైలర్లు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి.. అమ్మకాలు పెంచుకోవడానికి ఉపయోగిచే మార్కెటింగ్ వ్యూహాలు. అందుకే తదుపరి సారి మీరు ఏదైనా ఆఫర్ చూసినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. “ఈ వస్తువు నాకు నిజంగా అవసరమా? లేక డిస్కౌంట్ ఉందనే కారణంతోనే కొంటున్నానా?” అని ఆలోచించి కొనండి..
