లేఆఫ్స్ కాలంలో కొత్త ఆప్షన్?.. ఈ జంతువు పెంపకమే బెటర్ అంటున్న యూత్!
ఉద్యోగాల కంటే ఈ పెంపకమే బెటర్ అంటూ నెటిజన్లు వేస్తున్న సెటైర్లు, ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలు వివరాలు ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 7 March 2026 1:25 PM ISTఐటీ రంగంలో లేఆఫ్స్ భయం గుబులు పుట్టిస్తోంది. అమెజాన్, ఒరాకిల్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలే ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటే, ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందో అని అన్ని రకాల జాబ్స్ చేసేవాళ్ళు వణికిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం 'గాడిదల పెంపకానికి' రూ. 50 లక్షల సబ్సిడీ ఇస్తామంటూ ప్రకటించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగాల కంటే ఈ పెంపకమే బెటర్ అంటూ నెటిజన్లు వేస్తున్న సెటైర్లు, ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలు వివరాలు ఇప్పుడు చూద్దాం.
అన్ని రకాల ఉద్యోగాలకు గండం.. గాడిదల పెంపకం వైపు చూపు:
ఒకప్పుడు జాబ్ అంటే అది ఒక స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెల్లవారితే జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం. ఈ టెన్షన్ల మధ్య బతకడం కంటే, ప్రశాంతంగా ఊరెళ్లి గాడిదలను పెంచుకోవడం మేలని కొందరు సరదాగా అంటుంటే, మరికొందరు మాత్రం ప్రభుత్వం ఇస్తున్న రూ. 50 లక్షల సబ్సిడీ ఆఫర్‌ను సీరియస్‌గానే గమనిస్తున్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కేంద్రం ఇస్తున్న ఈ భారీ ఆర్థిక సాయం, ఉద్యోగ భద్రత లేని ఈ కాలంలో ఒక కొత్త వ్యాపార మార్గంగా కనిపిస్తోందని యువత సోషల్ మీడియాలో చర్చించుకుంటోంది.
సబ్సిడీ సంగతేంటి? రూ. 50 లక్షలు ఎలా వస్తాయి:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ప్రకారం, గాడిదల పెంపక కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. గరిష్టంగా రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ఫామ్ మొదలుపెట్టాలి. అది కూడా మన దేశీయ జాతి గాడిదలనే పెంచాలి. ఐటీ కంపెనీలో టార్గెట్లు, డెడ్ లైన్ల కోసం రాత్రింబవళ్లు కష్టపడే కంటే, ఇలాంటి వినూత్న పశుపోషణ రంగంలోకి దిగి ప్రభుత్వ సాయంతో సొంతంగా ఎదగడం ఒక మంచి ఆప్షన్ అని కొందరు ఆలోచిస్తున్నారు.
సెటైర్లు వర్సెస్ రియాలిటీ.. భవిష్యత్తు ఇదేనా:
సోషల్ మీడియాలో ఈ స్కీమ్ మీద ఎన్ని జోకులు పేలుతున్నా, దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. దేశంలో గాడిదల సంఖ్య 60 శాతం తగ్గిపోవడంతో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యాంత్రీకరణ పెరిగి రవాణాకు వీటిని వాడకపోయినా, గాడిద పాలకి ఉన్న డిమాండ్ అంటే ఈ పాలు లీటరు వేలల్లో ఉంటుంది మరి. ఇక ప్రభుత్వం ఇచ్చే ఈ భారీ సబ్సిడీ వల్ల ఇది లాభదాయకమైన బిజినెస్‌గా మారే అవకాశం ఉంది. లేఆఫ్స్ భయంతో బిక్కుబిక్కుమనే యువతకు, ఇది ఒక విచిత్రమైన కానీ లాభసాటి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
