Begin typing your search above and press return to search.

సందట్లో సడేమియా.. మన కాక్రోచ్ లను ‘క్యాష్’ చేసుకొని లొల్లి పుట్టిస్తున్న పాకిస్తానీలు

మా దేశంలో సరిగ్గా ఇంటర్నెట్ సరిపోవడం లేదని బాధపడకండి.. ఢిల్లీ పోలీసుల పుణ్యమా అని పాకిస్థాన్ ట్రోలర్లకు ఇప్పుడు కావాల్సినంత విశ్రాంతి దొరికింది.

By:  A.N.Kumar   |   24 July 2026 11:44 AM IST
సందట్లో సడేమియా.. మన కాక్రోచ్ లను ‘క్యాష్’ చేసుకొని లొల్లి పుట్టిస్తున్న పాకిస్తానీలు
X

మా దేశంలో సరిగ్గా ఇంటర్నెట్ సరిపోవడం లేదని బాధపడకండి.. ఢిల్లీ పోలీసుల పుణ్యమా అని పాకిస్థాన్ ట్రోలర్లకు ఇప్పుడు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. దేశంలో సీజేపీ నిరసనల ముసుగులో 'పాత వీడియోలకు కొత్త మసాలాలు' దట్టించి నిప్పులు పోయాలని చూసిన మన పొరుగుదేశపు 480 సోషల్ మీడియా 'సైబర్ యోధులను' ఢిల్లీ పోలీసులు సైలెంట్‌గా హోమ్‌వర్క్ పూర్తి చేయించి మరీ ఖాతాలు డిలీట్ చేయించేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీలో తాజాగా జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలను ఆసరాగా చేసుకుని దేశంలో అలజడులు సృష్టించేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు జరుగుతున్నట్లు బయటపడింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. దేశంలో ఉద్రిక్తతలు పెంచడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సుమారు 480 పాక్ ఆధారిత సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తించి బ్లాక్ చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

అసత్య సమాచారం.. ఎడిట్ చేసిన వీడియోలతో కుట్ర

పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనలకు సంబంధించి నిజాలకు పూర్తిగా విరుద్ధమైన పోస్టులు, ఏళ్లు గడిచిన పాత వీడియోలు, ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసిన దృశ్యాలను విదేశీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నెట్టింట్లో వైరల్ చేశారు. దేశ ప్రజల్లో ఆందోళనలు, అపోహలు, అనుమానాలు రేకెత్తించి, సామాజిక శాంతికి భంగం కలిగించడమే ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు గుర్తించారు. ఇటువంటి తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ విభాగాలు వేగంగా స్పందించి ఈ ఖాతాలను నిలిపివేశాయి.

యువత, విద్యార్థులకు పోలీసుల కీలక హెచ్చరికలు

ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా వినియోగదారులకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్త లేదా వీడియోను గుడ్డిగా నమ్మవద్దని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసే ముందు దాన్ని అధికారిక సోర్స్ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా విదేశీ ఖాతాల నుంచి ప్రచారంలోకి వచ్చే సంచలనాత్మక సందేశాలు, అనుమానాస్పద దృశ్యాలను రీపోస్ట్ లేదా షేర్ చేయకూడదు.

ఫేక్ న్యూస్‌పై అవగాహన వీడియో విడుదల

ప్రజల్లో ఫేక్ న్యూస్‌పై చైతన్యాన్ని పెంపొందించడానికి ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక అవగాహన వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో ముఖ్యంగా తప్పుడు ప్రచారం ఎలా జరుగుతుందో వివరించారు. నకిలీ వార్తలను, ఎడిట్ చేసిన వీడియోలను గుర్తించే పద్ధతులను చూపించారు. ఆన్‌లైన్ రూమర్లకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో మార్గదర్శకాలు అందించారు. "దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విదేశాల నుంచి జరిగే డిజిటల్ కుట్రలను, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు" అని ఢిల్లీ పోలీస్ యంత్రాంగం పేర్కొంది.

అనుమానాస్పద ఖాతాలపై ఫిర్యాదు చేయండి

సోషల్ మీడియాలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని లేదా సంచలన రూమర్లను వ్యాప్తి చేస్తున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. దేశ భద్రత, సామాజిక సమతుల్యాన్ని కాపాడటంలో ప్రతి పౌరుడి సహకారం ఎంతో కీలకమని పోలీసులు స్పష్టం చేశారు. నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిజమైన సమాచారాన్ని మాత్రమే ప్రాసెస్ చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి విదేశీ కుట్రలకు అడ్డుకట్ట వేయగలమని అధికారులు పునరుద్ఘాటించారు.