మరుభూమిగా దివిసీమ... చరిత్రలో చేదు జ్ఞాపకం
ప్రకృతి ముందు మనిషి ఎంత అంటే జవాబు లేదు. కాలం మాయజాలంలో అంకెలను లెక్కిస్తూ ఆయుష్షుని పీలుస్తూ ఏదో నాటికి మటు మాయం అయ్యే గాలి బుడగ మనిషి జీవితం.
By: Satya P | 20 Nov 2025 8:32 AM ISTప్రకృతి ముందు మనిషి ఎంత అంటే జవాబు లేదు. కాలం మాయజాలంలో అంకెలను లెక్కిస్తూ ఆయుష్షుని పీలుస్తూ ఏదో నాటికి మటు మాయం అయ్యే గాలి బుడగ మనిషి జీవితం. అలాంటి మనిషిని మింగేద్దామని ప్రకృతే ఆగ్రహిస్తే జల ఖడ్గానికి బలి కాక ఏమి చేయగలడు, దివి సీమలో జరిగింది ఇదే. ఇప్పటికి సరిగ్గా 48 ఏళ్ళ క్రితం. ఉమ్మడి క్రిష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలోని దివిసీమ రాత్రికి రాత్రి మరుభూమిగా మారిపోయింది. అప్పటిదాకా సాధారణ తుఫాను గా ఉన్నది కాస్తా రాకాసిగా మారిపోయింది. ఎవరికీ సూచనలు లేవు, సంకేతాలు అంతకంటే లేవు, అలా నిశ్శబ్ద నిశీధిలో ఊళ్ళకు ఊళ్ళూ ఉప్పెన ముంచేసింది. వేలాది మందిని తన పొట్టన పెట్టుకుంది.
యాభై వేల మంది :
ఇదిలా ఉంటే ఏపీలో ఆంధ్ర ప్రదేశ్ చరితలో దివిసీమ ఉప్పెన ఒక భయంకరమైన జ్ఞాపకం గా నిలిచి ఉంది. యావత్తు ఆంధ్ర ప్రదేశ్ నే వణించించిన పెను తుఫాను దివిసీమను ఉప్పెన రూపంలో విరుచుకుపడి మొత్తం మింగేసింది. ఈ విలయం సృష్టించిన విధ్వంసం లెక్కలేనిది. ప్రపంచంలోనే అతి భయంకరమైన తుఫానుగా ముద్ర పడినది. 1977, నవంబరు 19న ఈ తుఫాను భారతదేశం తూర్పు సముద్రతీరానికి పెద్ద ఎత్తున తాకింది. రాత్రికి రాత్రే ఊళ్ళు అన్నీ జల సమాధి అయ్యాయి. ఇక దివిసీమ ఉప్పన ధాటికి ఏకంగా మరణించిన వారు చూస్తే యాభై వేల మంది అని పేర్కొంటారు. అధికారికంగానే 14 వేల 204 మంది అని అంచనా వేశారు అంటే దివిసీమ ఉప్పెనను తలచుకుంటే వణుకే పుడుతుంది. ఇక ఆస్తి నష్టం ఆ రోజులలో చూస్తే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అంటే. ఈ రోజుకి లెక్క తీస్తే ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అన్న మాట.
దివిసీమ నా కర్మభూమి :
ఇదిలా ఉంటే 1977 దివిసీమ ఉప్పెనకు 48 సంవత్సరాలు పూర్తి అయిన నేపధ్యంలో మచిలీపట్నంలో సంస్మరణ సభ తో పాటు ఆనాడు ఎనలేని సాయం చేసిన మానవతామూర్తులకు దివ్య వందనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అవనిగడ్డ వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిసీమలో పొందిన ప్రేరణ మరువలేనిది అని గత స్మృతులను తలచుకున్నారు. దివిసీమ నా కర్మభూమి అని మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.
ఇంకా మదిలోనే ఉన్నాయి :
దివిసీమ గ్రామాల్లో ఉప్పెన సమయంలో చేసిన సేవల జ్ఞాపకాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయని దత్తాత్రేయ అన్నారు. పర్రచివర, దిండి, సొర్లగొంది, మూలపాలెం, కోడూరు గ్రామాల్లో తాము సేవ చేసిన జ్ఞాపకాలు ఇంకా తన మదిలో మెదలుతూనే ఉన్నాయని ఆయన భావోద్వేగానికి గురి అయ్యారు. దివిసీమలో సహాయక చర్యల కోసం ఆరు నెలలు గడిపిన కాలం తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిందని అన్నారు. దివిసీమలో పొందిన ప్రేరణ మరువలేనిదన్నారు. దివిసీమ ఉప్పెనకు సహాయక చర్యలకు తాము వచ్చినప్పుడు వేల మంది మృతి చెంది ఎటు చూసినా కొట్టుకుపోయిన గ్రామాలు, కుప్పలుగా శవాలు చూసి తమ వంతు కర్తవ్యంగా సామూహిక శవ దహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా దత్తాత్రేయ తెలిపారు.
మండలి సేవలు నిరుపమానం :
ఇక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మండలి వెంకట క్రిష్ణారావు, తానొక మంత్రిగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ముళ్ల బాటలో నడిచి కాళ్లకు పుండ్లు పడినా లెక్కచేయకుండా సహాయ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించారని వక్తలు గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా గ్రామాలలో పునరావాస పునర్నిర్మాణ కార్యక్రమాలతో తనను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలిచిన దివిసీమ ప్రజల నిజమైన నాయకుడుగా మండలి వెంకట కృష్ణారావు నిలిచారు అని ని స్మరించుకున్నారు. ఉప్పెన సహాయక చర్యలకు దేశ విదేశాల నుంచి 132 స్వచ్ఛంద సంస్థలు వస్తే వాటన్నిటిని ఒకే వేదికపైకి చేర్చిన ఘనత ఆయనదే అని అన్నారు. పార్టీలు, సిద్ధాంతాలు, భావజాలాలకు అతీతంగా విశాల హృదయంతో ప్రజా సేవ చేసిన నాయకుడు కృష్ణారావు అని వక్తలు తెలిపారు. నీతి నిజాయితీలతో నైతిక విలువలు పాటిస్తూ జీవించిన గాంధేయవాది కృష్ణారావు అన్నారు. తండ్రి బాటలోనే గాంధేయవాదిగా బుద్ధప్రసాద్ చేస్తున్న కృషి అపూర్వమన్నారు. ప్రస్తుత పాలకులు అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తీర గ్రామాల మత్స్యకారులకు సమాచారం ఇవ్వటంతో పాటు, రహదారులు, కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
నాటి సీఎం వెన్ను దన్ను :
ఆనాడు దివిసీమ ఉప్పెన సమయంలో ఉన్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, తదుపరి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి దివిసీమకు అండగా నిలిచారని మండలి బుద్ధ ప్రసాద్ చెప్పారు. మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యునిగా దివిసీమలో తుఫాన్ షెల్టర్ల నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరై దివిసీమలో రోడ్ల అభివృద్ధికి ప్రకృతి వైపరీత్యాల తాను చేసిన కృషిని వివరించారు.
విపత్తుల్లో పెద్ద విపత్తు :
రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శితి కంఠానంద మహరాజ్ మాట్లాడుతూ 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెన స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వచ్చిన విపత్తుల్లో పెద్ద విపత్తు అన్నారు. ఉప్పెనతో మరుభూమిగా మారిన దివిసీమను దివ్యసీమగా మార్చిన వారు ఆనాటి పాలకులు అని గుర్తు చేసుకున్నారు.
