Begin typing your search above and press return to search.

బాబు గారూ ఇలాంటి తప్పులు చేయొద్దు ప్లీజ్..!

ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని, 48 మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రచారం జరగడం వల్ల ప్రభుత్వ పరపతి బలహీనమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   11 Nov 2025 3:00 AM IST
బాబు గారూ ఇలాంటి తప్పులు చేయొద్దు ప్లీజ్..!
X

ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపుతుండటం వల్ల నియోజకవర్గాల్లో తాము చులకన అవుతామని కొందరు ఎమ్మెల్యేలు మదనపడుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధినేతలో ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూడలేదని, కానీ ఈ సారి ఆయన తీసుకుంటున్న అతి జాగ్రత్తల వల్ల మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉందని సీనియర్లు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెలిసిన తాము క్రమశిక్షణ రాహిత్యంతో ఎలా నడుచుకుంటామని, ఏదో సందర్భంలో చేసిన చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసి చూపడం కరెక్టు కాదని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.

పార్టీలో 48 మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని, వారందరికీ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నెల 8న పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ బ్యాక్ ఆఫీసు సిబ్బంది, ప్రొగ్రాం కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు నెలనెలా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎగవేస్తున్నారని, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీరియస్ అయ్యారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కోప్పడటంలో తప్పేమీ లేకపోయినా, ఆ విషయాన్ని మీడియాకు లీకు చేయడంపైనే ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యాలయ సిబ్బందిని సీఎం అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెబుతున్నారు.

48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని, పార్టీ, ప్రభుత్వ పనుల్లో పాల్గొనేలా వారిని గైడ్ చేయాలని సీఎం సూచిస్తే, మీడియాలో తప్పుగా ప్రచారం జరిగిందని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల వద్ద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రత్యర్థి మీడియా తప్పుగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తాము సరిగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారని, నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేక వాతావరణం ఉందని ప్రత్యర్థులు చాటుతున్నారని, దీనివల్ల రాజకీయంగా ఇబ్బంది తలెత్తుతుందని ఎమ్మెల్యేలు వాదిస్తున్నట్లు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు, సమయానికి చెక్కులు అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కడో, ఎప్పుడో లోపం జరిగి ఉంటుందని, అంతమాత్రాన తాము పూర్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయానికి రావడం కరెక్టు కాదని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ కార్యాలయంలో పనిచేసిన వారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాట్లాడే అంతర్గత విషయాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి, మీడియాకు లీక్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు.

ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని, 48 మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రచారం జరగడం వల్ల ప్రభుత్వ పరపతి బలహీనమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారని అంటున్నారు. 135 మంది ఎమ్మెల్యేల్లో 48 మంది అంటే దాదాపు మూడొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు అధినేత చెప్పినట్లు పార్టీ కార్యాలయం నుంచి లీకులు ఇవ్వడంపై ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ప్రత్యర్థులు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇకపై ఇలాంటిది ఏదైనా ఉంటే పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తమకు సమాచారం ఇవ్వాలని, అలా కాకుండా పత్రికలకు లీకులు ఇవ్వడం వల్ల అధినేత చంద్రబాబుకు మచ్చ తేవొద్దని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరినట్లు చెబుతున్నారు.