Begin typing your search above and press return to search.

45 రోజుల పసిపాపను కాపాడారు.. నేపాల్ లో అద్భుతం జరిగింది

నేపాల్‌లోని రసువా ప్రాంతం ఇటీవల భారీ వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్‌తో అతలాకుతలమైంది. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తాయి.

By:  A.N.Kumar   |   1 Sept 2026 3:58 PM IST
45 రోజుల పసిపాపను కాపాడారు.. నేపాల్ లో అద్భుతం జరిగింది
X

నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం మధ్య ఒక అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. చుట్టూ వరద నీరు.. ఎటు చూసినా ప్రమాదమే.. ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో 45 రోజుల పసిపాపతో పాటు ఆమె తల్లి సురక్షితంగా బయటపడటం అక్కడి ప్రజల్లో కొత్త ఆశను నింపింది. రెస్క్యూ సిబ్బంది సమయానికి స్పందించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

నేపాల్‌లోని రసువా ప్రాంతం ఇటీవల భారీ వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్‌తో అతలాకుతలమైంది. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో ఓ తల్లి తన కేవలం 45 రోజుల వయసున్న పసికందుతో ఇంట్లోనే చిక్కుకుపోయింది.

బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని భయంతో రోజులు గడిపింది. ఒకవైపు వరద నీరు.. మరోవైపు అప్పుడే లోకాన్ని చూసిన తన బిడ్డను ఎలా కాపాడుకోవాలన్న ఆందోళన. ఆ తల్లి అనుభవించిన ఆ వేదనను మాటల్లో చెప్పడం కూడా కష్టం.

చివరకు దాదాపు వారం రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది వారి ఆచూకీ గుర్తించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద ప్రభావిత ప్రాంతంలోకి వెళ్లిన సిబ్బంది.. తల్లి, బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

అయితే రెస్క్యూ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది ఆ 45 రోజుల పసిపాపే. ఇన్ని రోజుల పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బిడ్డ సురక్షితంగా ఉండటాన్ని చూసి మహిళా జవాన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని మురిసిపోయారు. కొద్దిసేపు ఆ పాపను తమ బిడ్డలాగే చూసుకుంటూ ప్రేమను పంచారు.

ఆ తర్వాత తల్లీబిడ్డలను సమీపంలోని క్యాంపుకు తరలించారు. అక్కడ వారికి అవసరమైన సహాయం అందించారు. తాము వరదల సమయంలో ఇంట్లో చిక్కుకుపోయామని చిన్నారి తల్లి రెస్క్యూ సిబ్బందికి వివరించారు.

ఒకవైపు ప్రకృతి విలయం.. మరోవైపు ప్రాణాల కోసం పోరాటం. ఆ భయానక పరిస్థితుల్లో 45 రోజుల పసిపాప సురక్షితంగా బయటపడటం నిజంగా ఒక అద్భుతమే. ఆ చిన్నారి ముఖంపై కనిపించిన అమాయకపు చిరునవ్వు.. ఆమెను చూసి మురిసిపోయిన మహిళా జవాన్ల కళ్లలో కనిపించిన ఆనందం.. విపత్తుల మధ్య కూడా మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పే గొప్ప దృశ్యంగా నిలిచింది.

వరదలు ఎన్నో విషాదాలను మిగిల్చినా.. ఈ చిన్నారి కథ మాత్రం చీకటిలో వెలుగులా మారింది. ప్రాణాలు కాపాడటమే తమ కర్తవ్యంగా భావించిన రెస్క్యూ సిబ్బంది చేసిన ఈ ప్రయత్నం.. ఒక తల్లి ఒడిని, ఒక పసిబిడ్డ భవిష్యత్తును కాపాడింది.