సముద్రంలో 438రోజులు ఒంటరిగా
నిజానికి సముద్రంలో చిక్కుకున్న ఒంటరి ప్రయాణికుడు జీవితంపై హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి.
By: Sivaji Kontham | 22 Nov 2025 10:38 AM ISTసముద్రంలో చిక్కుకున్న ఓ పడవలో 16 ఏళ్ల యువకుడు, అతడితో పాటు నివశించే పెద్ద పులి... ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ ప్రమాదకర వన్యప్రాణితో అతడి జీవనం ఎలా సాగింది? అనే కథాంశంతో లైఫ్ ఆఫ్ పై తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆంగ్ లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ లను కొల్లగొట్టడమే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకుంది. అధునాతన వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించడంలో ఆంగ్ లీ ప్రతిభ ఇప్పటికీ ఫిలింస్కూల్ స్టూడెంట్స్ కి ఒక గొప్ప పాఠం..
నిజానికి సముద్రంలో చిక్కుకున్న ఒంటరి ప్రయాణికుడు జీవితంపై హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. గాల్లో కూలిపోయిన విమానం నుంచి సముద్రంలో పడిన ఫెడ్ ఎక్స్ కొరియర్ బోయ్ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. సముద్రం నుంచి ఒంటరి దీవికి కొట్టుకు వచ్చిన తర్వాత అతడు ఎలా సర్వైవ్ అయ్యాడు? అన్నదానిని కల్ట్ జానర్ లో అద్భుతంగా తెరకెక్కించారు.
అయితే ఇప్పుడు సముద్రంలో చిక్కుకుని 438 రోజుల పాటు (దాదాపు ఏడాది పైగా) అతడు ఒంటరి పోరాటం సాగించిన విధానం, ఆ తర్వాత అతడు తిరిగి భూమ్మీదకు వచ్చాక లక్ష మిలియన్ల డాలర్ల దావా కారణంగా చిక్కుల్లో పడిన విధానం ఇదంతా వినడానికే సినిమా కథను తలపిస్తోంది. 438 రోజులు సముద్రంలో తప్పిపోయిన వ్యక్తిపై తన సహచర ప్రయాణికుడి కుటుంబ సభ్యులు 1,000,000 డాలర్ల కోసం దావా వేశారు.
అతడి కథలోకి వెళితే చాలా ఆసక్తికర విషయాలున్నాయి. మత్స్యకారుడు జోస్ సాల్వడార్ అల్వారెంగా నవంబర్ 2012లో తన సహచరుడు కార్డోబా (22)తో కలిసి మెక్సికో నుంచి రెండు రోజుల చేపల వేట యాత్రకు వెళ్లాడు. కానీ తుఫాన్ భీభత్సంలో చిక్కుకుని పడవ బోల్తా పడటంతో 438 రోజులు కనిపించకుండా పోయాడు. ఒక వ్యక్తి సముద్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం బతికి బయటపడటం ఇదే చరిత్రలో మొదటిసారి, ఆ తర్వాత కూడా అతడు భూమికి చేరుకుని 1 మిలియన్ డాలర్ల కోర్టు కేసులో చిక్కుకోవడం పెద్ద ట్విస్ట్.
రెండు రోజుల ప్రయాణం దాదాపు 15 నెలల పాటు దిగ్భంధనంలో చిక్కుకునే కష్టకాలంగా మారుతుందని అతడికి తెలీదు. చివరికి ఈ ప్రయాణం 22 ఏళ్ల కార్డోబా ప్రాణాలను బలిగొంది. ఎనిమిది మీటర్ల పడవలో సాగించిన ప్రయాణంలో ఆ ఇద్దరూ ఒక హింసాత్మక తుఫాన్‌లో చిక్కుకున్నారు. ఈ తుఫాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేసింది. పడవలో సామాగ్రిని సముద్రంలోకి విసిరివేసింది. అల్వారెంగా చెప్పిన వివరాల ప్రకారం.. తాను, కార్డోబా భయాందోళనకు గురయ్యారు. తమ చుట్టూ సొరచేపలు, ముసళ్లు తిరుగుతున్నాయని చెప్పాడు. నెలల పాటు చేపలు, పక్షులను పట్టుకుని పచ్చిమాంసం తిన్నారు. అలాగే వర్షపు నీరు, తాబేలు రక్తం తాగి జీవించగలిగారు.
అయితే ఈ ప్రయాణంలో విషాదకరంగా 22ఏళ్ల కార్డోబా కడుపులో విషపూరితమైన పామును తిన్న పక్షిని తినడం వల్ల మరణించాడు. కానీ అల్వారెంగా తన సహచరుడి శవాన్ని తిననని వాగ్దానం చేసాడు. కార్డోబా మృతదేహాన్ని ఆరు రోజులు తనతో ఉంచుకున్నానని అల్వారెంగా పేర్కొన్నాడు. సహచరుడు స్పృహ కోల్పోతున్నాడని గ్రహించి శరీరాన్ని సముద్రంలోకి విసిరే వరకు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించానని కూడా చెప్పాడు. నా చావు కూడా నెమ్మదిగా ఉంటుందని అర్థమైనట్టు తెలిపాడు. జనవరి 2014లో దాదాపు 15 నెలల తర్వాత మార్షల్ దీవులలో కొట్టుకుపోయిన అల్వారెంగా ఒక అద్భుతంలా ప్రాణాలతో బయటపడ్డాడు.
అతడు చివరికి తన తల్లిని కలిసాడు. ఆపై అల్వారెంగా ఒక పుస్తక ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 1 మిలియన్ డాలర్ కోసం సహచరుని కుటుంబం దావా వేయడం చిక్కుల్లోకి నెట్టింది. అంతే కాదు అతడి సహచరుడు కార్డోబా కుటుంబం కూడా అల్వారెంగా నరమాంస భక్షణకు పాల్పడ్డాడని ఆరోపించింది. అల్వారెంగా తన సహచరుడు కార్డోబా శరీరాన్ని తిన్నాడనే ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. వారిలో ఎవరో ఒకరు చనిపోతే ఒకరినొకరు తినకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. 2015 అక్టోబర్‌లో ప్రచురించిన అల్వారెంగా పుస్తకం `438 డేస్` ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం ఇవ్వాలని కూడా కేసు వేసిన లాయర్ డిమాండ్ చేశారు. రాయల్టీలో సగం డబ్బు ఇవ్వాలని కార్డోబా కుటుంబం వాదించింది.
