Begin typing your search above and press return to search.

దేశంలోనే అతిపెద్ద దోపిడీలలో ఒకటి.. మూడు రాష్ట్రాల్లో ఏమి జరుగుతుంది!

ఇందులో భాగంగా.. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా.. ఈ సమయంలో కర్ణాటకతో పాటు గోవా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

By:  Raja Ch   |   27 Jan 2026 3:19 PM IST
దేశంలోనే అతిపెద్ద దోపిడీలలో  ఒకటి.. మూడు రాష్ట్రాల్లో ఏమి జరుగుతుంది!
X

దేశంలో జరిగిన అతిపెద్ద దోపిడీలలో ఒకటిగా అభివర్ణించబడుతున్న రూ.400 కోట్లతో వెళ్తున్న రెండు కంటైనర్లు కనిపించడం లేదనే కేసులో కీలక పరిణామాలు చొటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా.. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా.. ఈ సమయంలో కర్ణాటకతో పాటు గోవా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

అవును... గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు ప్రయాణిస్తున్నట్లు చెప్పబడుతున్న రెండు భారీ కంటెయినర్ల లోపల వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయన్న ఆరోపణలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్టోబరు 22న కర్ణాటకలోని చోర్లా ఘాట్‌ ప్రాంతంలో ఈ కంటెయినర్లు దారి దోపిడీకి గురయ్యాయంటూ.. మహారాష్ట్రలోని నాసిక్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ లో డిసెంబరు 17న సందీప్‌ దత్త పాటిల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఇందులో భాగంగా... థానేకు చెందిన రియల్టర్ కిషోర్ సావ్లాకు చెందిన రూ.400 కోట్ల విలువైన రద్దయిన రూ.2,000 నోట్లను తీసుకెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కులు దొంగిలించబడ్డాయని సందీప్ దత్తా పాటిల్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా... విశాల్‌ నాయుడు, కిశోర్‌ శేఠ్‌ అనే ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి, ఆ దోపిడీకి తానే కారణమంటూ నెలన్నర పాటు వేధించారని అతడు ఆరోపించాడు. ఈ వ్యవహారం వెనుక విరాట్‌ గాంధీ ఉన్నాడని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో... మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ స్పందిస్తూ.. ఈ ఫిర్యాదుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తర్వాత, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై సెక్షన్లు 115(2), 140(3), 351(2), 352 కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ సందర్భంగా స్పందించిన బెళగావి ఎస్పీ కే రామరాజన్... ఈ దోపిడీని దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో జిల్లా నుండి ఒక బృందం సమన్వయం చేసుకుంటోందని.. మరిన్ని వివరాలకు ఈ బృందం నాసిక్‌ లో ఉందని తెలిపారు. ఇదే సమయంలో... గోవా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు! దీనిపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర.. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఖచ్చితమైన సమాచారం అందిన తర్వాతే ప్రభుత్వం దీనిపై వ్యాఖ్యానిస్తుందని అన్నారు.

ఈ క్రమంలో... ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ డబ్బు తరలించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది! అయితే.. ఈ ఆరోపణలపై కర్ణాటక మంత్రులు ప్రియాంక్‌ ఖర్గే, సతీశ్‌ జార్ఖిహొళి తీవ్రంగా స్పందిస్తూ.. మహారాష్ట్ర, గోవాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని.. అరెస్టైన వారిలో కొందరు గుజరాత్‌ కు చెందినవారని అన్నారు! ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ కేసు ఏ విధంగా కొలిక్కి వస్తుందనేది వేచి చూడాలి.