400 కోట్ల లూటీ-నాలుగు రాష్ట్రాలు-దేశాన్ని కుదిపేస్తున్న కొత్త వివాదం!
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 400 కోట్ల రూపాయల కరెన్సీ. ఇదేమీ ఆన్‌లైన్ సొమ్ము కూడా కాదు. పక్కాగా ఒక కంటైనర్‌లో ఉన్న సొమ్ము.
By: Garuda Media | 27 Jan 2026 5:00 AM ISTఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 400 కోట్ల రూపాయల కరెన్సీ. ఇదేమీ ఆన్‌లైన్ సొమ్ము కూడా కాదు. పక్కాగా ఒక కంటైనర్‌లో ఉన్న సొమ్ము. కానీ, ఇది అనూహ్యంగా కనిపించకుండాపోయింది. మణిరత్న గతంలో తీసిన సినిమా.. `దొంగ-దొంగ` మూవీలో జరిగినట్టుగా.. ఈ దోపిడీ జరగడం గమనార్హం. గుజరాత్ నుంచి మహారాష్ట్ర-కర్ణాటక-గోవాల మీదుగా తిరుపతి చేరాల్సిన సొమ్ము అని కొందరు.. కాదు.. గుజరాత్ నుంచి మహారాష్ట్ర మీదుగా కర్ణాటక-గోవాలకు చేరాల్సిన సొమ్ము అని మరికొందరు ఇలా.. వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా ఈ సొమ్ము కనిపించకుండా పోయి(భారీ కంటైనర్) చాలా రోజులు అయింది.
అంతేకాదు.. సదరు కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ కూడా.. ఈ నెల 18నే మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సొమ్ముఎలా పోయింది? ఎక్కడికి పోయింది? అసలు ఇంత సొమ్మును ఎవరు తరలిస్తున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ప్రయోజనం ఏంటి? అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. పైగా.. ఈ వివాదం మూడు రాష్ట్రాల చుట్టూ తిరుగుతోంది. కేసు నమోదైంది.. మహారాష్ట్రలో(డ్రైవర్ ఫిర్యాదు మేరకు) కానీ, ఘటన జరిగింది.. గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని బెళగావిలో. దీంతో ఈ మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించడం.. పోలీసులు ఎవరికి వారుగా వ్యవహరించడంతో అసలు ఈ వ్యవహారం ఏంటనేది తేలడం లేదు.
రాజకీయం తోడు!
ఈ 400 కోట్ల కంటైనర్ ను కొందరు దుండగులు.. బెళగావిలో డ్రైవర్‌ను అటకాయించి.. బెదిరించి.. పక్కకు నెట్టేసి.. కంటైనర్‌ను ఎత్తుకు పోయారని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. బెళగావి తమ పరిధిలోనే వస్తుందని.. కానీ, గోవాతోనూ సంబంధాలు ఉన్నాయని కర్ణాటక మంత్రి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ముందుకు రావాలని కోరుతున్నారు. ఇదిలావుంటే.. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. త్వరలోనే తమిళనాడు, కేరళ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పంచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కంటైనర్‌ను తెప్పిస్తున్నారని.. బీజేపీ నాయకులు విమర్శించారు.
అయితే.. అసలు ఆ సొమ్ము వచ్చిందే గుజరాత్ నుంచి అని .. అక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో.. అందరికీ తెలుసునని కాంగ్రెస్ పార్టీ నాయకులు(కర్నాటక ప్రభుత్వం) ఎదురు దాడి చేస్తున్నారు. మరోవైపు తిరుపతికి ఈ కంటైనర్ చేరాల్సి ఉందని అంటున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి తమిళనాడుకు, కేరళకు(రెండు రాష్ట్రాలకు దగ్గర దారి) చేర్చేందుకే.. కంటైనర్‌లో సొమ్ము తరలించారని.. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మరో విశేషం. ఏదేమైనా 400 కోట్ల రూపాయల కరెన్సీతో కూడిన కంటైనర్ మాయం కావడం.. అది కూడా అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలు ఉండే జాతీయ రహదారిపైనే కంటైనర్ ను దోపిడీ చేయడం..వారాలు గడుస్తున్నా విషయాన్ని దాచిపెడుతున్నారన్న వాదన వినిపిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
