క్యాబ్‌లో నిద్రిస్తున్న బిడ్డను 'మరచిపోయిన' తల్లిదండ్రులు..
ఇది కేవలం అదృష్టం వల్ల మాత్రమే సాఫీగా ముగిసిందని చెప్పాలి. పిల్లలు కారులో ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాదకరమో అనేక సందర్భాలు చూపించాయి.
By: Tupaki Political Desk | 17 Feb 2026 1:38 PM ISTచేతిలో ఒక బ్యాగ్ మరిచిపోయామంటే సరేలే అనుకోవచ్చు.. విలువైన బంగారం కూడా మరిచిపోయామంటే మళ్లీ కొనచ్చులే అనుకోవచ్చు.. కానీ నవమాసాలు మోసి చావును కూడా లెక్కచేయకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను మరిచిపోవడం జరుగుతుందా? అస్సలు కాదు.. ఇది జరగనే జరగదు. తల్లికి బిడ్డ తర్వాతే.. భర్త అయినా.. ఆమె తల్లితండ్రులైనా.. కానీ నేడు విలువలు మారిపోతున్నాయా? లేక ఒత్తిడి పెరుగుతందా..? ఒక తల్లి తన కొడుకును క్యాబ్ లో మరిచిపోయింది.. వదిలించుకోవాలని కాదు.. మరిచిపోయింది. వెంటనే ఏడుస్తూ పోలీసుల వద్దకు పరుగులు తీసింది. నిమిషాల్లో కొడుకు చెంతకు చేరడంతో ఊపిరిపీల్చుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ప్రతి నెటిజన్ కన్నీటి పర్యంతమయ్యాడంటే అతిశయోక్తి కాదు..
బెంగళూర్ లో ఘటన..
బెంగళూరులో జరిగిన ఒక ఘటన తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో, అదే సమయంలో పోలీసుల అప్రమత్తత ఎంత కీలకమో మరోసారి గుర్తు చేసింది. క్యాబ్ లో తన కుమారుడిని మరిచిపోగా వేగంగా స్పందించిన పోలీసులు నిమిషాల్లో వెతికి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఫిబ్రవరి 14న ట్రిప్ ముగించుకొని క్యాబ్ లో ఇంటికి చేరుకున్న ఓ జంట తమ నాలుగేళ్ల కుమారుడు క్యాబ్‌లో నిద్రపోతున్నాడని గమనించకుండానే దిగిపోయారు. కారు వెళ్లిపోవడంతో కొన్ని క్షణాల్లోనే వారు షాక్‌కు గురయ్యారు. బిడ్డ క్యాబ్‌లోనే ఉన్నాడని గుర్తించగానే ఆ జంట తీవ్ర భయాందోళనకు గురైంది.
వారు ఆలస్యం చేయకుండా ‘డయ్ 112’ హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు. ఇది పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలకు తక్షణ సహాయం అందించే సమగ్ర ఎమర్జెన్సీ వ్యవస్థ. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా స్పందించారు. కేవలం రెండు నిమిషాల్లోనే ఇద్దరు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వేగం వల్లే ఆ చిన్నారి తల్లిదండ్రుల వద్ద చేరుకున్నాడు.
రెండు నిమిషాల్లో తల్లి చెంతకు బిడ్డ..
పోలీసులు వెంటనే వాహనం నంబర్‌ను ట్రాక్ చేసి, లైవ్ లొకేషన్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించారు. డ్రైవర్‌తో మాట్లాడిన తర్వాత, కారులో చిన్నారి నిద్రపోతున్నాడని ధృవీకరించారు. ఆ వెంటనే డ్రైవర్‌ను జంట నివాసానికి వెళ్లమని సూచించారు. అదృష్టవశాత్తు డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. గంటలోపే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకొని బిడ్డను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించాడు.
తల్లిదండ్రుల దృష్టి పిల్లలపైనే ఉండాలి..
ఇది కేవలం అదృష్టం వల్ల మాత్రమే సాఫీగా ముగిసిందని చెప్పాలి. పిల్లలు కారులో ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాదకరమో అనేక సందర్భాలు చూపించాయి. తలుపులు లాక్ కావడం, ఊపిరాడకపోవడం, అపహరణ ప్రమాదం వంటి అనేక ముప్పులు ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు.
పోలీసుల కౌన్సెలింగ్..
పోలీసులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రిప్ ముగిసిన తర్వాత, ప్రత్యేకంగా పిల్లలు నిద్రపోతున్నప్పుడు, వాహనం పూర్తిగా ఖాళీ అయ్యిందని నిర్ధారించుకోవడం ప్రతి తల్లీ, తండ్రి బాధ్యత అని వారు గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది బెంగళూరు పోలీసులు వేగంగా స్పందించడంతో ప్రశంసించారు. అత్యవసర సేవలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో నిరూపించిందని అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు, కొందరు తల్లిదండ్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
మనందరికీ హెచ్చరిక..
ఈ ఘటన మనందరికీ హెచ్చరిక. రోజువారీ పరుగుపందెంలో అలసట, తొందరపాటు, మానసిక ఒత్తిడి అన్నీ కలిసి చిన్న చిన్న పొరపాట్లకు దారితీస్తాయి. కానీ పిల్లల విషయంలో మాత్రం ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం తగదు. వాహనం నుంచి దిగేముందు ఒకసారి వెనక్కి చూసుకోవడం, పిల్లలను చేతిలో పట్టుకుని దిగడం వంటి చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారించగలవు.
మొత్తానికి, ఈ సంఘటనలో చిన్నారి సురక్షితంగా తిరిగి రావడం ఒక సంతోషకర విషయం. పోలీసుల అప్రమత్తత, హెల్ప్‌లైన్ వ్యవస్థ సమర్థత, డ్రైవర్ బాధ్యత అన్నీ కలిసి ఒక కుటుంబాన్ని పెద్ద విషాదం నుంచి కాపాడాయి. అదే సమయంలో ఇది ప్రతి తల్లితండ్రికి ఒక మేల్కొలుపు పిల్లల భద్రత విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం తగదు.
